- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Warangal: పైసలు దండిగా.. పనులు దండగ!
వరంగల్ మహామహా నగరం దిశగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ సర్కారు కొత్తకొత్త ప్రాజెక్టులకు ప్లాన్ వేస్తోంది.

దిశ, వరంగల్ టౌన్ : వరంగల్ మహామహా నగరం దిశగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ సర్కారు కొత్తకొత్త ప్రాజెక్టులకు ప్లాన్ వేస్తోంది. ‘పాత ఒక రోత.. కొత్త ఒక వింత’ అన్నట్లు నగరంలో గతంలో చేపట్టిన పనులు అధికారులు, పాలకుల తీరును వెక్కిరిస్తున్నాయి. ‘మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనే’ అన్నట్లు పాత పనులను పక్కన పడేసి కొత్తవాటికి పరుగులు తీస్తున్నారు. ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. పదేళ్ల కిందట ప్రారంభమైన స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. గడిచిన పదేళ్ల కాలంలో రూ.200కోట్లకు పైగా ఖర్చు పెట్టిన వరంగల్ మహానగర పాలక సంస్థ సుందరీకరణ అంధకారమయంగానే ఉండడం ప్రభుత్వ లక్ష్యానికి, పాలకుల నిర్లక్యానికి అద్దం పడుతున్నది.
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..!
వరంగల్ మహానగరం 2015లో స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుకు ఎంపికైంది. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నగరాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనేది లక్ష్యం. ఇందులో మెరుగైన రహదారులు, వీధి దీపాలు, సరైన పార్కింగ్, ఫుట్‌పాత్‌లు, ప్రజలకు అవసరమైన తాగునీరు, మరుగుదొడ్లు లాంటి వసతులు కల్పించాల్సి ఉంది. అయితే, వాటిలో కొన్ని చేపట్టినా నిరుపయోగంగానే మారిపోయాయి. కొన్ని ఉపయోగించకుండానే మిగిలిపోయాయి.
మచ్చుకు కొన్ని..
పోచమ్మమైదాన్ నుంచి వరంగల్ చౌరస్తా మీదుగా బస్టాండ్ వరకు నిర్మించిన సీసీ రోడ్డు నిర్మాణం అధ్వానంగా తయారైంది. వరంగల్ నగరంలో ప్రధాన రహదారిగా చెప్పుకునే ఈ రోడ్డు దుస్థితి చెప్పనలవి కావు. మొదట డివైడర్లు కట్టాలని మధ్యలో ప్లేస్ వదిలి రోడ్డు వేశారు. ఆ తర్వాత రోడ్డు వైశాల్యంలో తేడాలున్నాయో లేదా డివైడర్లకు డబ్బులు లేవో గానీ, డివైడర్లకు వదిలిన ప్లేసును మళ్లీ సీసీతో పూడ్చివేశారు. దీంతో అందగా తీర్చిదిద్దాలనుకున్న ఈ రహదారికి డివైడర్ దిష్టిచుక్కలా మారింది. అభివృద్ధి అంటే ఉన్న వాటిని మరింతగా విస్తరించాలి కానీ, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో ఉన్నవాటిని తొలగించడం విస్మయానికి గురిచేస్తోంది. ముప్పై ఏళ్ల క్రితమే వరంగల్ బస్టాండ్ నుంచి కాశిబుగ్గమీదుగా, అటు చౌరస్తా మీదుగా ములుగు రోడ్డు వరకు రెండు వైపులా డివైడర్లు ఉండేవి. కాంట్రాక్టర్ల గుడ్డితనమో, అధికారుల అంధకారమో గానీ స్మార్ట్ సిటీ పనుల్లో డివైడర్ల మాయం చేశారు. నగరాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నామని జబ్బలు చరుచుకుంటున్నారు.
పనికిరానికి ప్లాన్లు!
ఏ పని చేపట్టినా ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలనేదే లక్ష్యం. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు పనులకు ఎవరు ప్లాన్ వేశారో గానీ ప్రజలకు పనికిరానివిగానే మిగిలిపోతున్నాయి. ‘ఐదు నిమిషాల్లో మరుగుదొడ్లను చేరుకోవచ్చు’ అంటూ ప్రకటన బోర్డులు ఏర్పాటు చేసి ఒక్కోదానికి రూ.5లక్షలు వెచ్చించి ఏర్పాట్లు చేసిన మరుగుదొడ్లు ఎన్ని పనిచేస్తున్నాయో అధికారులకే తెలియాలి. హన్మకొండలోని బల్దియా రిపేరు షెడ్డులో ఏర్పాటు చేసిన స్మార్ట్ మరుగుదొడ్డిని పరిశీలిస్తే అధికారుల పనితనం, ప్లానింగ్ తీరు ఇట్టే అర్థమైపోతుంది. అంతకుమించిన నిర్లక్ష్యం బల్దియా ప్రధాన కార్యాలయం వద్ద నిర్మించిన టాయిలెట్లు అధికారులు, పాలకుల అంధకారానికి అద్దం పడుతుంది.
రోడ్లతో ముంపు సమస్య..
ఇక నగరంలో ప్రధాన రోడ్ల దుస్థితి అధ్వానంగా మారింది. అంతకంటే దారుణంగా అంతర్గత రహదారులు మారాయి. రోడ్డు మీద రోడ్డు వేసి. ప్రజల ఇళ్లకు ముంపు సమస్య తెచ్చిపెట్టారు. ఇంటి నిర్మాణాల కంటే రోడ్ల ఎత్తు పెరిగి ఇళ్లు ముంపునకు గురయ్యాయి. వాస్తవానికి రోడ్డు వేయాలంటే ఉన్న రోడ్డు తీసివేసి కొత్త రోడ్డు వేయాలి, కానీ ఉన్న రోడ్డు మీద మళ్లీ రోడ్డు పోయడం ప్రజా జీవనానికి ఆటంకంగా మారింది. వర్షం పడినప్పుడల్లా రోడ్ల మీది నుంచి నీరు నేరుగా ఇళ్లలోకి చేరుతుంది. నగరంలోని వీధుల్లో నెలలకొద్ది వీధి దీపాలు వెలగడంలేదని పలువురు గ్రీవెన్స్ లో విన్నవించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇదీ మన బల్దియా ఇంజినీరింగ్ వ్యవస్థకు నిలువెత్తు నిదర్శనం.
పారిశుధ్యం అస్తవ్యస్తం..
ఇక నగరంలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. స్వచ్ఛ భారత్ పేరిట వాహనాలను సమకూర్చి ఇంటింటా చెత్తను సేకరిస్తున్నప్పటికీ నగరంలో చెత్తచెదారం కనిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా వరంగల్ మార్కెట్ ఏరియాలో పారిశుధ్య నిర్వహణ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజారోగ్య విభాగం నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. ఇక్కడ ఒక్కచోటే కాదు, సాక్షాత్తు బల్దియా బడా కార్యాలయం పరిసర ప్రాంతాల్లోనే చెత్తాచెదారం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. వీధి వ్యాపారాలు, రోడ్డు మీద టిఫిన్ సెంటర్లు, బిర్యానీ సెంటర్లు ఉన్న ప్రాంతాల్లో మురుగు కాల్వలు నిండుకుని దుర్వాసన వెదజల్లుతున్నాయి.
అన్నీ వదిలి.. చెరువుల్లో మునిగి!
నగరంలో ఇన్ని సమస్యలు రాజ్యమేలుతుండగా స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్ నీడలో అధికారులు, పాలకులు చెరువుల అభివృద్ధి పేరిట ఓలలాడుతున్నారు. చేసిన పనులే చేయిస్తున్నారో.. లేదా కొత్తకొత్తగా ప్లాన్లు వేస్తున్నారో గానీ పదేళ్లుగా వరంగల్ భద్రకాళి బండ్ ఇప్పటికీ పూర్తికాలేదు. ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. ఇదిలా ఉండగానే భద్రకాళి చెరువు ప్రక్షాళనకు బల్దియా అధికారులు, పాలకులు ఆగమేఘాల మీద పనులకు పూనుకోవడం చూస్తుంటే ప్రజాధనాన్ని ఖర్చు చేయడంలో ఉన్న ఆత్రుతే కనిపిస్తోంది తప్ప అభివృద్ధి మీద లేదనేది స్పష్టమవుతోంది.






