యూరియా కొరత తీరేదెన్నడు? ఎర్రబడుతున్న పంట‌లు

by velandi.Saikiran |

మరో మాసం రోజుల్లో వరి పంట చేతికందే సమయం వస్తుండగా భూపాలపల్లి జిల్లాలో యూరియా కొరత మాత్రం తీరలేదు. ఒక్క బస్తా

యూరియా కొరత తీరేదెన్నడు? ఎర్రబడుతున్న పంట‌లు
X

దిశ, భూపాలపల్లి: మరో మాసం రోజుల్లో వరి పంట చేతికందే సమయం వస్తుండగా భూపాలపల్లి జిల్లాలో యూరియా కొరత మాత్రం తీరలేదు. ఒక్క బస్తా యూరియా కోసం రైతన్నలు రాత్రిపగలు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. చరిత్రలోనే ఇంత దారుణమైన రోజులు లేవని రైతులు వాపోతున్నారు. నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నా ఒక్క యూరియా బస్తా చేతికందలేదని మండిపడుతున్నారు. సొసైటీలు, ఫెర్టిలైజర్​షాపుల్లో వచ్చిన యూరియా ఎటుపోతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలొకొంది.

అధికారులు పర్యవేక్షించిన అందని యూరియా..

వ్యవసాయ అధికారులు, పోలీసు అధికారులు సొసైటీలు, మందుల దుకాణాల వద్ద దగ్గరుండి యూరియా బస్తాలు పంపిణీ చేస్తున్నా రైతాంగానికి అందడం లేదు. ప్రతీరోజు టన్నులకొద్ది యూరియా భూపాలపల్లి జిల్లాకు వస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు పేర్కొన్నారు. పంపిణీ చేస్తున్న యూరియా ఎవరి ఇళ్లకు చేరుతుందో అధికారులు సమాధానం చెప్పాలి. నిరుపేద రైతులకు మాత్రం యూరియా అందడం లేదనేదని వాపోతున్నారు. కొంతమంది నాయకులు, పెద్ద రైతులు అవసరానికి మించి యూరియా బస్తాలు తీసుకోవడంతోనే పేదరైతాంగానికి ఇబ్బందులు తప్పడం లేదనే చర్చ జరుగుతోంది. మరో వైపు వరి, పత్తి పంటలు ఎర్రబడి పోతుందని, యూరియా వేస్తే తప్పా పంట ఎదిగే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం యూరియా సరిపడా సరఫరా చేస్తున్నామని చెబుతున్నా పంట పొలాలకు మాత్రం చేరడం లేదు.

జిల్లావ్యాప్తంగా వేధిస్తున్న కొరత..

నేటికీ జిల్లాలో యూరియా కోసం మహిళలు, వృద్ధులు, పిల్లలు కుటుంబమంతా క్యూలో గంటల తరబడి నిలబడుతున్నారు. ముఖ్యంగా భూపాలపల్లి జిల్లాలోని కాటారం, రేగొండ, ఘనపురం, చిట్యాల, మహదేవపూర్ మండలాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది దీనికి కారణం పాలకులు, అధికారులకే అర్థం కావడం లేదు. సోమవారం ఘణపురం, రేగొండలో యూరియా కోసం వేలాది మంది బారులుతీరారంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 12 గంటలపాటు పడిగాపులు కాసినా ఒక్క యూరియా బస్తా దొరకలేదని రైతులు వాపోతున్నారు. అధికారులు చెబుతున్న దానికి వాస్తవ పరిస్థితులకు సంబంధం లేకుండా పోతుందని మండిపడుతున్నారు. డీసీఎంఎస్, పీఏసీఎస్​లో ఎదుట రైతులు ఎప్పుడు యూరియా లారీలు వస్తాయా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రైవేట్ దుకాణాల్లో యూరియా బస్తా కొనాలంటే కనీసం రూ.500 దాటుతుంది. యూరియాతోపాటు అదనంగా క్రిమిసంహారక మందులు అంటగడుతున్నారని వాపోతున్నారు. తప్పని పరిస్థితిలో కొంతమంది రైతులు ప్రైవేట్ దుకాణాల్లో యూరియా కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. పంట చేతి కందకుండా పోతుందనే ఉద్దేశంతో రైతులు ప్రైవేట్ దుకాణాల్లో యూరియా కొనుగోలు చేసి భారీగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి భూపాలపల్లి జిల్లాలో రైతాంగానికి సరిపడా యూరియాను సరఫరా చేసి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరో 10 రోజుల గడిస్తే వరి పంటకు యూరియా వేసినా ఆ పంట చేతికందదని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

Next Story