ప్ర‌జాసంగ్రామ యాత్ర‌లో ర‌ణ‌రంగం.. టీఆర్ఎస్, బీజేపీ కార్య‌క‌ర్త‌ల ప‌ర‌స్ప‌ర దాడులు

by Dishafeatures2 |
ప్ర‌జాసంగ్రామ యాత్ర‌లో ర‌ణ‌రంగం.. టీఆర్ఎస్, బీజేపీ కార్య‌క‌ర్త‌ల ప‌ర‌స్ప‌ర దాడులు
X

దిశ, దేవరుప్పుల / పాలకుర్తి : పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం దేవ‌రుప్పుల మండ‌లంలో సోమ‌వారం ప్రారంభ‌మైన ప్ర‌జా సంగ్రామ యాత్రలో బీజేపీ, టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. దేవ‌రుప్పుల మండ‌ల కేంద్రంలో ఆజాదికా అమృత్ మ‌హోత్స‌వం వేడుక‌ల్లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, ఎంపీ బండి సంజ‌య్ కుమార్ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న క్ర‌మంలో టీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌ల నుంచి మొద‌ట నిర‌స‌న స్వ‌రాలు వినిపించాయి.

కేసీఆర్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు ఏం చేసింద‌ని ఇక్క‌డికి వ‌చ్చి ప్ర‌శ్నిస్తున్నారంటూ నిర‌స‌న‌కారుల‌ను ఉద్దేశించి బండి సంజ‌య్ మాట్లాడుతున్న క్ర‌మంలో స‌ముహం నుంచి ఒక్క‌సారిగా రాళ్లు, క‌ర్ర‌ల దాడి ఆరంభ‌మైంది. దీంతో బీజేపీ కార్య‌క‌ర్త‌ల నుంచి కూడా ప్ర‌తిఘ‌ట‌న మొద‌లైంది. ప‌ర‌స్ప‌ర దాడుల‌తో ఒక్క‌సారిగా ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ప‌రిస్థితిని గ‌మ‌నించి ఇరువ‌ర్గాల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసేలోగానే ప‌రిస్థితి అదుపు త‌ప్పింది.

ఈ ప‌ర‌స్ప‌ర దాడుల్లో రెండు పార్టీల‌కు చెందిన కార్య‌క‌ర్త‌ల‌కు గాయాల‌య్యాయి. వాస్త‌వానికి బండి సంజ‌య్ ప్ర‌జా సంగ్రామ యాత్ర ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు జ‌రుగుతాయ‌ని పోలీసులు ముందుగానే ఊహించారు. పెద్ద ఎత్తున సీఆర్పీఎఫ్ బ‌ల‌గాల‌ను సైతం మొహ‌రించారు. అయితే ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం చోటు చేసుకోకుండా అడ్డుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌నే చెప్పాలి.

చాతకాకుంటే ఇంట్లో కూర్చో.. సీపీపై బండి సంజ‌య్ ఆగ్ర‌హం..

విధులు నిర్వ‌హించ‌డం చాత‌కాకుంటే ఇంట్లో కూర్చోవాలంటూ వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ త‌రుణ్ జోషిపై బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. సంఘ‌ట‌న స్థ‌లం నుంచే డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డికి బండి సంజ‌య్ ఫోన్ చేసి మాట్లాడారు. ముందుగా అన్ని ప‌ర్మిష‌న్లు తీసుకుని యాత్ర‌కు బ‌య‌ల్దేరినా క‌నీసం ప్రొటెక్ష‌న్ క‌ల్పించ‌కుంటే పోలీసులు ఏం విధులు నిర్వ‌హిస్తున్న‌ట్లు అంటూ ప్ర‌శ్నించారు. ఒక ద‌శ‌లో సీపీ త‌రుణ్ జోషిని యూజ్‌లెస్ ఫెలో అంటూ మండిప‌డ్డారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారార‌ని ఆరోపించారు.

అధికార పార్టీ కార్య‌క‌ర్త‌లు చేసిన దాడుల్లో బీజేపీ కార్య‌క‌ర్త‌ల త‌ల‌లు ప‌గిలిపోయాయ‌ని అన్నారు. దాడి చేసిన అధికార పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను వ‌దిలి బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పైనే పోలీసులు లాఠీ చార్జికి దిగారంటూ మండిప‌డ్డారు. ప‌ది నిముషాల్లో ప‌రిస్థితిని అదుపులోకి తీసుకువ‌చ్చి త‌మ యాత్ర‌కు విఘాతం క‌ల‌గ‌కుండా చూడాల‌ని, లేనిప‌క్షంలో తామెంటో చూపిస్తామంటూ చెప్పారు. పోలీసుల వైఖ‌రికి నిర‌స‌న‌గా త‌న‌కు క‌ల్పించిన భ‌ద్ర‌త సిబ్బందిని వారించారు. త‌న భ‌ద్ర‌త‌ను పార్టీ కార్య‌క‌ర్త‌లే చూసుకుంటారంటూ భ‌ద్ర‌త‌ను స్వీక‌రించ‌డానికి నిరాక‌రించారు.

Next Story

Most Viewed