మానుకోటలో మట్టి మాఫియా జోరు.!

by Elthuri vijay kumar |   (  Updated:2025-09-07 14:33:10  IST  )

బేతోల్ సీలింగ్ భూముల నుంచి అక్రమంగా తరలింపు, రెండూ..మూడు నెలలు గా కొనసాగుతున్న దందా.

మానుకోటలో మట్టి మాఫియా జోరు.!
X

మానుకోటలో మట్టి మాఫియా జోరు.!

- బేతోల్ సీలింగ్ భూముల నుంచి అక్రమంగా తరలింపు

- రెండూ..మూడు నెలలు గా కొనసాగుతున్న దందా.

- లక్షల్లో సొమ్ము చేసుకుంటున్న మాఫియా

- సీనరేజ్, రాయల్టీపై మౌనం పాటిస్తున్న మైనింగ్ శాఖ

దిశ,మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో మట్టి మాఫియా జోరుగా సాగుతోంది. సీలింగ్ భూముల ఎక్కడ అంటూ అన్వేషిస్తూ..మట్టి గుట్టలను టార్గెట్ చేస్తూ వాటిని కొల్లగొడుతూ భూముల చదును పేరిట రైతులకు ఆశ చూపుతూ పిసరంత అనుమతితో రాత్రి పగలు తేడా లేకుండా మట్టిని తరలిస్తూ లక్షల్లో సొమ్ము చేసుకుంటుందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మట్టి అక్రమ రవాణాపై ఫిర్యాదులు చేసినప్పటికీ అడ్డుకోవాల్సిన మైనింగ్ అధికారులు అటువైపుగా కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. దీనికి కారణం రాజకీయ నాయకుల ఒత్తిడియా ?లేక అధికారులు ఆమ్యామ్యాలకు అలవాటు పడుతున్నారా ? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

బేతోల్ సీలింగ్ భూములే మైనింగ్ మాఫియా టార్గెట్?

మహబూబాబాద్ శివారు బేతోల్ గ్రామ పరిధిలో 78 సర్వే నెంబర్ లో సుమారు 7 ఎకరాల సీలింగ్ పట్టా మట్టిగుట్ట కలదు. భూముల చదును పేరిట రైతులకు ఆశ చూపి అనుమతుల మాటున మట్టి మాఫియా జేసీబీలు, ట్రాక్టర్లు, లారీలు , టిప్పర్లలో మట్టిని తరలిస్తున్నారు. దూరాన్ని బట్టి ధర నిర్ణయిస్తూ వేలల్లో మట్టిని అమ్ముకుంటున్నట్టు సమాచారం. ఇదేకాక దాని పక్కనే ఉన్న కోడిదల గుట్టకు సైతం మైనింగ్ మాఫియా సూటి పెట్టినట్టు తెలుస్తుంది. వర్షాలు పడడంతో అటువైపుగా వెళ్లే దారి పూర్తిగా బురదమయం కావడంతో తాత్కాలికంగా మట్టి తరలింపు ఆగినట్టు తెలుస్తోంది.

రెండు, మూడు నెలలుగా సాగుతున్న దందా.!

బేతోల్ మట్టిగుట్ట నుండి అక్రమ మైనింగ్ మట్టి రవాణా సుమారు రెండు ,మూడు నెలలుగా సాగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. పంట పొలాలకు,చెరువు కట్టకు వెళ్లే దారి టిప్పర్ల రవాణా దాటికి మొత్తం ధ్వంసమై నడవడానికి కూడా వీలు లేకుండా తయారైందని రైతులు వాపోతున్నారు ఇదేంటని ప్రశ్నిస్తే మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోవట్లేదని మండిపడుతున్నారు.

లక్షల్లో సొమ్ము చేసుకుంటున్న మైనింగ్ మాఫియా!

మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని వెంచర్ లతో పాటు, కురవి మండల పరిధిలోని కొన్ని వెంచర్లకు పెద్ద ఎత్తున మట్టిని తరలిస్తున్నారు. ఒక్క ట్రిప్పు టిప్పర్ మట్టికి రూ.ఆరు వేల చొప్పున రోజుకు ఇరవై నుండి ముప్పై ట్రిప్పుల మట్టిని తరలిస్తున్నట్టు సమాచారం. అంటే రోజుకు రూ.లక్షన్నర చొప్పున మైనింగ్ మాఫియా దండుకుంటున్నట్టు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ లెక్కన నెలలో ఎంత రాబడి వస్తుందో ఇట్టే అర్థమవుతోంది.

సినరేజ్, రాయల్టీపై మౌనం పాటిస్తున్న మైనింగ్ శాఖ!

ప్రైవేట్ పట్టా, సీలింగ్, ప్రభుత్వ భూముల నుండి మట్టిని తరలించే ముందు మైనింగ్ శాఖకు క్యూబిక్ మీటర్ల చొప్పున రాయల్టీ ఫీజ్ కట్టాల్సి ఉంటుంది. పెద్ద ఎత్తున మట్టి తరలి పోతున్నప్పటికీ జిల్లా మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టింపు ఉండడం లేదు. గతంలో అనుమతి తీసుకున్న దానికి మించి అధికమట్టి తరలింపుపై ఫైన్లు విధించినప్పటికీ ఇప్పటికీ ఫైన్ల పైకం చెల్లింపు జరగలేదని సమాచారం. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు బేతోల్ గ్రామ పరిధిలో మట్టి రవాణాకు ఎవరికైనా అనుమతి ఇచ్చారా ? ఎంత పర్మిషన్ ఇచ్చారు? ఏ సర్వే నెంబర్లలో పర్మిషన్ ఇచ్చారు ? రాయల్టీ ఫీజు ఎంత కట్టారు ? ఆ భూముల నుంచి మట్టి తరలింపునకు అనుమతి ఇవ్వొచ్చా ? ఇలా పలు రకాల ప్రశ్నలు సంధించినప్పటికీ వారు స్పందించకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. దీనిపై మైనింగ్ ఏడీ వెంకటరమణను వివరణ కోరే ప్రయత్నం చేయగా ఎప్పటిలాగే వారు ఈ వ్యవహారంపై స్పందించలేదు.

Next Story