- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కన్నీళ్లు పెట్టిస్తున్న కొత్త విధానం.. కౌలు రైతుల బాధలు వర్ణనాతీతం
ఒకసారి రైతు యూరియా బుక్ చేసుకుంటే తిరిగి మళ్లీ నెల రోజుల వరకు ఎంత అవసరం ఉన్నా యూరియా దొరికే పరిస్థితి లేదని వాపోతున్నారు.

దిశ,ఎల్కతుర్తి: రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. యూరియా కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చింది. రైతులు సులభంగా ఇంటి నుంచే యూరియా బుక్‌చేసుకునే అవకాశం కల్పించింది. కానీ స్మార్ట్‌ఫోన్‌పై అవగాహన లేని రైతులు బుకింగ్ కోసం నానా అవస్థలు పడుతున్నారు. ఒకసారి రైతు యూరియా బుక్ చేసుకుంటే తిరిగి మళ్లీ నెల రోజుల వరకు ఎంత అవసరం ఉన్నా యూరియా దొరికే పరిస్థితి లేదని వాపోతున్నారు. ప్రస్తుతం వరి పొట్ట దశలో ఉండటంతో యూరియా తప్పనిసరిగా మారింది. మొక్కజొన్న కంకి దశలో యూరియా కలిపి పొటాష్ వేయాల్సిందే.
మండల కేంద్రంలో ఒక సొసైటీకి యూరియా వస్తే ఒక ఎకరం ఉన్న రైతు కూడా 10 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తుంది. మండలంలోని 20 గ్రామాల్లోని రైతులు మండల కేంద్రానికి యూరియా కోసం రావాల్సి ఉంటుంది. కొందరు రైతులకు భూమి ఉన్నప్పటికీ పట్టాదారు పాస్ పుస్తకం లేకపోవడంతో బుకింగ్ చేసుకునే సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. స్మార్ట్ ఫోన్ వాడే రైతులకు బుకింగ్ చేసుకునే విధానం తెలుస్తుంది. సాధారణ ఫోన్ వాడే రైతులు పిల్లలతో బుక్ చేసుకున్నప్పటికీ ఓటీపీ చెప్పడంలో గందరగోళానికి గురైన సందర్భాలు ఉన్నాయి.
కౌలు రైతుల బాధలు అనేకం..
యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేయాలనుకునే రైతులకు పట్టాదారు పాస్ బుక్ వివరాలు, భూమి హక్కు కలిగిన వివరాలు యాప్ లో నమోదై ఉండాలి. కౌలు రైతు నేరుగా యూరియా బుక్ చేసుకునే సౌకర్యం లేదు. ఎవరు అయితే భూమి యజమాని ఉంటాడో అతను బుక్ చేసుకుని కౌలు రైతుకు ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సైబర్ నేరస్తులతో ఏదైనా అనర్థాలు జరగవచ్చని ఓటీపీ చెప్పడంలో భూమి యజమాని నిరాకరిస్తున్నాడు. ప్రభుత్వం కౌలు రైతులకు చట్టాలను తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియా కష్టాలు మొదలయ్యాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






