ప్రజల మధ్యే ఉంటూ.. అదే ఆశయంతో పని చేస్తా : మాజీ మావోయిస్ట్ నేత దామోదర్

by Ratna Kumari |

మావోయిస్టు పార్టీలో దళ సభ్యుడి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్, దాదాపు మూడు దశాబ్దాల సాయుధ ప్రస్థానం అనంతరం జనజీవన స్రవంతిలోకి చేరారు.

ప్రజల మధ్యే ఉంటూ.. అదే ఆశయంతో పని చేస్తా  : మాజీ మావోయిస్ట్ నేత దామోదర్
X

దిశ, ఏటూరునాగారం : మావోయిస్టు పార్టీలో దళ సభ్యుడి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్, దాదాపు మూడు దశాబ్దాల సాయుధ ప్రస్థానం అనంతరం జనజీవన స్రవంతిలోకి చేరారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లోంగిపోయిన ఆయన మంగళవారం తొలిసారి తన స్వగ్రామమైన ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చేరుకున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత గ్రామంలో అడుగుపెట్టిన దామోదర్‌కు కుటుంబ సభ్యులు, బంధువులు, పాత మిత్రులు మరియు గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు.

అమ్మతో ఆత్మీయ ఆలింగనం..

గ్రామానికి చేరుకున్న దామోదర్.. దాదాపు 28 సంవత్సరాల తర్వాత తన తల్లిని కలుసుకోవడం అత్యంత భావోద్వేగాన్ని నింపింది. ముసలి తల్లిని చూసి ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. తల్లి కొడుకులు ఒకరినొకరు అలింగనం చేసుకున్న దృశ్యం అక్కడి వారిని కలచివేసింది. అనంతరం బంధువులు, స్నేహితులతో కాసేపు ముచ్చటించి, పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా స్వగ్రామంలో మీడియాతో మాట్లాడిన దామోదర్, మావోయిస్ట్ పార్టీలో 30 ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత సొంత ఊరికి రావడం సంతృప్తినిచ్చిందని, తల్లిని కలవడం ఆనందంగా ఉందని తెలిపారు. అడవిలో గడిపిన కాలంలో వచ్చిన అనుభవం, సహనం తనకు మనోబలాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. తన భవిష్యత్ కార్యాచరణపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేనని చెప్పినా, జీవితాంతం ప్రజల మధ్యే ఉండి వారి కోసం పనిచేస్తానని వెల్లడించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.

అడవి బాట వీడి రండి..

అడవుల్లో ఉన్న మావోయిస్టు కార్యకర్తలు బయటకు వచ్చి సమాజంలో భాగస్వామ్యం కావాలని దామోదర్ పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వం కూడా మాజీలపైన విధిస్తున్న ఆంక్షలను తగ్గించాలని అభిప్రాయపడ్డారు. జైళ్లలో ఉన్న వారిని రాజకీయ ఖైదీలుగా గుర్తించి విడుదల చేయాలని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలను కోరినట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్లలో మరణించిన వారి కుటుంబాలను కలుసుకుని వారికి మనోధైర్యాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.

దళ సభ్యుడి నుంచి రాష్ట్ర కార్యదర్శి వరకు..

కాల్వపల్లి గ్రామానికి చెందిన బడే చొక్కారావు చిన్న వయసులోనే మావోయిస్టు భావజాలానికి ఆకర్షితులయ్యారు. 1993లో పీపుల్స్ వార్ గ్రూప్‌లో చేరి దళ సభ్యుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం ఎల్డీఎస్ కమాండర్, డిప్యూటీ కమాండర్, ఏటూరునాగారం ఏరియా కమిటీ కార్యదర్శి, జిల్లా కమిటీ సభ్యుడు, ఖమ్మం-కరీంనగర్వ-రంగల్ ప్రాంత కార్యదర్శి మరియు ఉత్తర తెలంగాణ డివిజన్ కమిటీ కార్యదర్శి వంటి పలు కీలక హోదాల్లో పనిచేశారు. చివరకు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగారు. ములుగు, భూపాలపల్లి అటవీ ప్రాంతాలపై పట్టు కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయనపై ఛత్తీస్‌గఢ్‌లో రూ.50 లక్షలు, తెలంగాణలో రూ.25 లక్షల రివార్డులు ప్రకటించబడ్డాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర కమిటీ సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీతో పాటు మరికొంత మంది నేతలతో కలిసి లొంగిపోవ‌డంతో ఆయన సాయుధ పోరాటానికి స్వస్తి పలికినట్లయింది.

Next Story