అంగన్వాడీ కేంద్రాల్లో పాడైన ఎగ్స్ కలకలం..!

by Bhanu |   (  Updated:2025-05-29 14:51:28  IST  )

హనుమకొండ జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇటీవల పంపిణీ చేసిన ఎగ్స్ లపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అంగన్వాడీ కేంద్రాల్లో పాడైన ఎగ్స్ కలకలం..!
X

దిశ, హనుమకొండ : హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అంగన్‌వాడీ కేంద్రాల్లో పంపిణీ చేస్తున్న ఎగ్స్ ల నాణ్యతపై ఇప్పుడు ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇటీవల ఆత్మకూరు మండలం, నీరుకుళ్ళ గ్రామంలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో సరఫరా చేసిన కొన్ని ఎగ్స్ పూర్తిగా పాడై ఉండటం వెలుగులోకి వచ్చింది. కొన్నింటిలో ఎగ్స్ లోని లోపలి భాగం పాడై కనిపించడం, మరికొన్నింటిలో తీవ్ర దుర్వాసన వెలువరించడం ప్రజల హృదయాలను కలచివేసింది.

తల్లిదండ్రుల్లో భయం.. పిల్లల ఆరోగ్యం పట్ల ఆందోళన..

ఈ ఎగ్స్ లను చిన్నారులకు ఆహారంగా అందించాల్సిన సమయంలో ఇలా పాడై ఉండటం తల్లిదండ్రులలో భయాన్ని కలిగిస్తోంది. ఇవే మంచి పోషకాహారం అని ఇచ్చే అధికారులు కనీసం చెక్ చేయడం కూడా మానేశారు. ఫలదీకరణం చెందిన గుడ్లను ఎలా ఇవ్వగలుగుతున్నారు? అని ఒక తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది.

నిల్వ, రవాణా లోపాలు.. నాణ్యత తనిఖీల మానవ దోషం..

పదేపదే జరుగుతున్న నాణ్యత లోపాలకు ప్రధాన కారణం నిల్వ, రవాణా వ్యవస్థలో కనబడుతున్న తీవ్రమైన వైఫల్యాలేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎగ్స్ లను తగిన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయకపోవడం, సరైన ప్యాకేజింగ్ లేకుండా తరలించడం, సరఫరా సమయంలో ఆలస్యం వంటి అంశాల వల్ల ఇవి పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఎగ్స్ లను సరఫరా చేసిన తర్వాత వాటిని వినియోగించే ముందు తగిన తనిఖీలు చేయాల్సిన బాధ్యత అధికారులదే. అయితే, ఈ చర్యలు ఏవీ చేపట్టకపోవడం, నేరుగా పంపిణీకి అనుమతి ఇవ్వడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని పలువురు మహిళలు వాపోతున్నారు. చిన్నారుల ఆరోగ్యంతో ఆటలాడకండి అని వారు హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించాలన్న ప్రజల డిమాండ్..

ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ఎగ్స్ పంపిణీకి ముందు చెక్కింగ్ తప్పనిసరి చేయాలి. పాడైనవి సరఫరా చేసిన వారికి కఠిన చర్యలు తీసుకోవాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు.

చిన్నారుల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి..

ఈ ఘటన ప్రభుత్వ ఆహార భద్రతా విధానాలపై గంభీర ప్రశ్నలు కలిగిస్తోంది. చిన్నారుల ఆరోగ్యం విషయంలో మినహాయింపు అనే మాటకు ఆస్కారమే ఉండకూడదు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎగ్స్ సరఫరా చేసే ఏజెన్సీలపై సమగ్ర విచారణ జరపాలి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో నిల్వ, చెకింగ్ వ్యవస్థను పునః సంఘటించాలి, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా విధివిధానాలను మరింత కఠినంగా అమలు చేయాలి అని కోరుతున్నారు. అనేక మంది తల్లిదండ్రులు, మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఈ ఘటనను తీవ్రంగా తప్పుపడుతూ, అధికారుల బాధ్యత నిర్లక్ష్యాన్ని ప్రస్తావిస్తున్నారు.

Next Story