- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమాజ హితమే జర్నలిజం లక్ష్యం కావాలి : కాకులమర్రి లక్ష్మణ్ బాబు
సమాజ హితమే జర్నలిజం లక్ష్యం కావాలి అన్నారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు.

దిశ, ఏటూరు నాగారం : సమాజ హితమే జర్నలిజం లక్ష్యం కావాలి అన్నారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు. ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన 'తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐజేయు)' ద్వితీయ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభంగా పిలవబడే జర్నలిజం, సమాజ గమనాన్ని నిర్దేశించే శక్తి కలిగినదని తెలిపారు. జర్నలిజం విలువలు, ప్రస్తుత పరిస్తుతులపై మాట్లాడారు.
జర్నలిజం అనేది కేవలం వార్తలను అందించడం మాత్రమే కాదు, అది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక పటిష్టమైన వారధి అని లక్ష్మణ్ బాబు అన్నారు. జర్నలిస్టులు ఏ రాజకీయ పార్టీకి లేదా వ్యక్తిగత సిద్ధాంతాలకు లోబడకుండా, కేవలం ప్రజా సమస్యలనే ఎజెండాగా మార్చుకోవాలని ఆయన సూచించారు. రాజకీయాలకు అతీతంగా ఉన్నప్పుడే జర్నలిజంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని స్పష్టం చేశారు. కేవలం ఉపరితల వార్తలు కాకుండా, సమాజంలోని లోపాలను, క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను నిష్పక్షపాతంగా వెలికితీయాలని కోరారు. వాస్తవాలను వక్రీకరించకుండా సమాజానికి అందించడమే నిజమైన జర్నలిజం అని ఆయన వివరించారు.
సామాజిక చైతన్యం - జర్నలిస్టుల కర్తవ్యం అని సమాజంలో మార్పు తీసుకురావడానికి జర్నలిస్టుల కలం ఒక ఆయుధంలా పనిచేయాలని లక్ష్మణ్ బాబు పిలుపునిచ్చారు. మూఢనమ్మకాలు, సామాజిక అసమానతలు, అవినీతిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత జర్నలిస్టులదేనని గుర్తుచేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ప్రజలలోకి తీసుకువెళ్లి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా కూడా జర్నలిస్టులు కృషి చేయాలని అన్నారు. ప్రజలను విద్యావంతులను చేస్తూ, వారి హక్కుల పట్ల అవగాహన కల్పించేలా కథనాలు ఉండాలని ఆకాంక్షించారు. అహర్నిశలు కష్టపడే జర్నలిస్టుల సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వారి సంక్షేమం కోసం జర్నలిస్టులకు న్యాయంగా రావలసిన అక్రిడేషన్ కార్డుల సంఖ్యను కూడా పెంచాలని రైల్వే పాస్ అర్హులైన జర్నలిస్టులందరకు, ఇండ్లను మంజూరు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు.
ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మీకు ఏ ఆపద వచ్చినా నేను ముందు ఉంటానని.. మీ సమస్యలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్తానని అన్నారు. జర్నలిజంలో మహిళల పాత్ర కూడా గణనీయంగా పెరగాలని ఈ సందర్భంగా కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆకాంక్షించారు. జర్నలిస్టుల వృత్తిపరమైన గౌరవాన్ని కాపాడటంలో లక్ష్మణ్ బాబు ముందుంటానని తెలిపారు.ఈ మహాసభలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, సీనియర్ జర్నలిస్టులు లక్ష్మణ్ బాబుని శాలువాతో సన్మానించారు. అనంతరం షీల్డ్ తో గౌరవించారు. ఈ మహాసభలో ఐజేయు జిల్లా, రాష్ట్ర నాయకులు, సీనియర్ జర్నలిస్టులు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు వివిధ మీడియా సంస్థల ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






