ఫాం ల్యాండ్ పేరిట రూ. కోట్లలో స్కాం

by Ajay Maddhiboyina |

ఫాం ల్యాండ్ మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మోసపోయిన బాధితులు గురువారం దిశ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని చూసి దిశను ఆశ్రయించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాల గ్రామ రెవెన్యూ పరిధిలోని ఆర్​అండ్​బీ గ్రామం సర్వే నెంబర్ 176,177 లో 16ఎకరాల పై చిలుకు విస్తీర్ణంలో 8 ఎకరాల్లో 250 ప్లాట్లు ఏర్పాటు చేశారు.

ఫాం ల్యాండ్ పేరిట రూ. కోట్లలో స్కాం
X

దిశ, వర్ధన్నపేట: ఫాం ల్యాండ్ మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మోసపోయిన బాధితులు గురువారం దిశ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని చూసి దిశను ఆశ్రయించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాల గ్రామ రెవెన్యూ పరిధిలోని ఆర్​అండ్​బీ గ్రామం సర్వే నెంబర్ 176,177 లో 16ఎకరాల పై చిలుకు విస్తీర్ణంలో 8 ఎకరాల్లో 250 ప్లాట్లు ఏర్పాటు చేశారు. ఫాం ల్యాండ్ నిర్వాహకులు నాలుగేళ్ల క్రితం ఆగర్వూడ్ చెట్లకు లక్షల్లో ఆదాయం వస్తుందని నమ్మబలికించి గుంటకు రూ.5లక్షల చొప్పున అమ్మకాలు జరిపారు. ఫాం ల్యాండ్ అక్రమాలపై తీగ లాగితే డొంక కదులుతోంది. కొనుగోలు దారులకు నాలా కన్వెన్షన్, హద్దు రాళ్లు లేకుండా అమ్మకాలు జరిపి మోసం చేశాడు. సదరు ప్లాట్లను తామే కొనుగోలు చేసి మార్కెట్ ధర ప్రకారం డబ్బులు చెల్లిస్తామని నిర్వాహకులు హామీ ఇచ్చారు.

రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడిన సొమ్ముతో పేద, మధ్య తరగతి ప్రజలు భవిష్యత్తులో ఎప్పుడైనా అమ్ముకోవచ్చనే ధీమాతో ప్లాట్లు కొనుగోలు చేశారు. అమ్మిన ప్లాట్లను కొనుగోలు చేయాలని వెంచర్ నిర్వాహకులను నిలదీయడంతో నాలా కన్వెన్షన్ ఉంటేనే కొనుగోలు చేస్తామని చెప్పడంతో మోసపోయామని ఖంగుతిన్న బాధితులు పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నాలా కన్వెన్షన్ చేసుకున్న ఓ బాధితుడు ప్లాటు కొనుగోలు చేయాలని అడిగితే రేపు మాపంటూ దాటవేస్తున్నట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ నేతల అండదండలతో అక్రమ పద్ధతిలో ప్లాట్ల అమ్మకాలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఫాం ల్యాండ్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితుల్లో స్థానికులంటే ఖమ్మం, వరంగల్ జిల్లా కేంద్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉండటం గమనార్హం. గతంలో పనిచేసిన తహసీల్దార్ గుంటల లెక్కన రిజిస్ట్రేషన్లు చేసి పాసుబుక్ లు జారీ చేశారు.

నిర్వాహకుల మాయమాటలు..

ఫాం ల్యాండ్ లో చెట్ల పేరుతో ప్లాట్ల దందా పెద్ద ఎత్తున నడిపించి భారీ మోసానికి తెరలేపారు. ఒక గుంట విస్తీర్ణంలో హద్దులు గా 4ఎర్ర చందనం మొక్కలతో పాటు లోపల 25 ఆగర్వూడ్ మొక్కలను నాటి భవిష్యత్తులో లక్షల్లో ఆదాయం వస్తుందని నమ్మించి రూ.5లక్షల చొప్పున అమ్మకాలు జరిపారు. బాధితులు నాలుగేళ్ల క్రితం తాము కట్టిన డబ్బులు ఇచ్చి ప్లాటు తీసుకోండని చెప్పినా నిర్వాహకులు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రజాప్రతినిధులు,లీడర్లను ఆశ్రయించి తమ గోడు వెల్లబోసుకుంటున్నట్లు సమాచారం. ఫాంల్యాండ్​పేరిట ప్లాల అమ్మకాలు జరుగుతుంటే పంచాయతీ కార్యదర్శి, ఎంపీవో పట్టించుకోక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

Next Story