- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిజిస్ట్రేషన్ తిప్పలు..ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు
ఉమ్మడి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలే కాదు.. కొన్ని తహసీల్ధార్ కార్యాలయాల్లో కూడా కాసులు లేనిదే పనులు కావడం లేదు.

రిజిస్ట్రేషన్ తిప్పలు
=వ్యవసాయ భూమి పట్టా కోసం
=ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు
=కాసులిస్తే తప్ప పని కావడం లేదు
=సీసీఎల్ఏ రూల్స్ తో ఇబ్బందులు పడుతున్న కొనుగోలుదారులు
దిశ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలే కాదు.. కొన్ని తహసీల్ధార్ కార్యాలయాల్లో కూడా కాసులు లేనిదే పనులు కావడం లేదు. కొంతమంది వ్యవసాయ భూమి పది గుంటల లోపు కొనుగోలు చేస్తే పట్టా రావడం లేదు. రిజిస్ట్రేషన్ కావడం లేదు. పంట వేసిన పట్టించుకోకపోవడంతో కొన్నవారు తహసీల్ధార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రిజిస్ట్రేషన్ కోసం తిప్పలు పడుతున్నారు. ఈ భూముల రిజిస్ట్రేషన్ కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సీసీఎల్ఏ రూల్స్ పేరున కొంత మంది అధికారులు పక్కనపెట్టడంతో లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన వారు పట్టా రాక సమస్యలు ఎదుర్కొంటున్నారు.ఉమ్మడి జిల్లా పరిధిలో వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు ఎక్కువ అవుతున్నాయి. గ్రేటర్ వరంగల్ నగరంతో పాటు జనగామ, పరకాల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, నర్సంపేట, తొర్రూరు, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీల పరిధిలో కూడా భూముల క్రయ విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ పరిధిలోని భూములకు డిమాండ్ పెరిగింది. ఎకరానికి కోటి నుంచి 4 కోట్ల వరకు ధరలు పలుకుతున్నాయి. కూడా పరిధి చుట్టూ 30 కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల ఎక్కువ మంది భూములపై దృష్టి పెట్టారు.
భవిష్యత్ అవసరాల కోసం కోట్లు పెట్టి ఎకరాలు కొనలేక లక్షలు పెట్టి భూములు కొంటున్నారు. తమ ఆర్థికస్థితి ని బట్టి చాలా మంది 3 గుంటలు, 5 గుంటలు, 10 గుంటలు, అర ఎకరం, ఎకరం వరకు కొనుగోలు చేస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన భూములకు 10 గుంటలపైన ఉంటేనే మండల తహిసీల్ధార్ వ్యవసాయ భూముల కింద రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అంతకు తక్కువగా ఉంటే చేయడం లేదు. సీసీఎల్ఏ నుంచి ఉత్తర్వులు ఉన్నాయని పేరుమీద పక్కకు పెడుతున్నారు. అవసరాల నిమిత్తం 3 గుంటలు, 5 గుంటలు, 10 గుంటలలోపు కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. దీనివల్ల లక్షలు పోసి భూములు కొనుగోలు చేసిన వారు ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది తహశీల్దార్లు నాళా కన్వర్షన్ చేసుకొని సబ్ రిజిస్ట్రార్ ల పరిధిలో గజాల చొప్పున రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరుతున్నారు.కొన్ని చోట్ల పంటలు ఉన్నాయా లేవా అని పరిశీలిస్తూ కొంత మంది అధికారులు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు.
వేల రూపాయలు తీసుకొని..
ప్రతి కార్యాలయంలో కొంతమంది పైరవికారులు పుట్టుకొస్తున్నారు. ఇలాంటి భూములు కొనుగోలు చేసిన వారితో మాట్లాడుతున్నారు. వేల రూపాయలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసి పట్టా బుక్ లు ఇస్తున్నారు. గ్రేటర్ వరంగల్ నగరం పరిధిలోని హసన్పర్తి, దామెర, గీస్కొండ, ఖిల్లా వరంగల్, సంగెం, ఐనవోలు, ఖాజిపేట, ధర్మసాగర్, చిల్పూర్ గుట్ట మండలాల పరిధిలో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కూడా లిమిట్స్ ఉండడం వల్ల సమస్యలు వస్తున్నాయి. ఇది ఆసరాగా చేసుకుని పైరవికారులు భారీగా వసూలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని మున్సిపాలిటీల మండలాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. వ్యవసాయ భూములు ఎన్ని గుంటలైనా తహసీల్దార్ పరిధిలో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉన్నా సీసీఎల్ఏ పరిధిలో రూల్స్ కు వ్యతిరేకంగా చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. వాస్తవంగా వ్యవసాయ భూమి అయితే దానిలో పంటలు ఉంటే సర్వే చేయించి దాని ఆధారంగా తహసీల్దార్లు రిజిస్ట్రేషన్ చేసేందుకు అవకాశం ఉంది. ప్రతి సోమవారం జరిగే ఫిర్యాదుల వివాదంలో ఎక్కువ మొత్తం ఇలాంటి భూములకు సంబంధించి ఫిర్యాదులే ఎక్కువగా వస్తున్నాయి. వీటన్నిటిపైన ఆయా జిల్లాల కలెక్టర్లు దృష్టి సారిస్తే రైతుల నుంచి భూములు కొనుగోలు చేసిన వారు ఇబ్బందులు తప్పేవి. అధికారులు మాత్రం సీసీఎల్ఏ ఉత్తర్వుల ప్రకారమే తాము ఈ పనులు చేస్తున్నామని తెలిపారు. నిబంధనల మేరకు పంటలు ఉంటే వాటిని రిజిస్ట్రేషన్ చేస్తున్నామని అన్నారు . ఈ సమస్యల పై ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే రైతుల నుంచి కొనుగోలు చేసిన వారి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.






