వ‌రుణుడి క‌రుణ‌..ఉమ్మ‌డి జిల్లాలో విస్తారంగా వాన‌లు

by Taduka Kalyani |   (  Updated:2025-07-23 15:18:26  IST  )

అదును దాటిపోతున్నా వ‌ర్షాలు ప‌డ‌క‌పోవ‌డంతో ఆందోళ‌న‌కు గుర‌వుతున్న అన్న‌దాత‌ల‌పై వ‌రుణుడు క‌రుణించాడు.

వ‌రుణుడి క‌రుణ‌..ఉమ్మ‌డి జిల్లాలో విస్తారంగా వాన‌లు
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : అదును దాటిపోతున్నా వ‌ర్షాలు ప‌డ‌క‌పోవ‌డంతో ఆందోళ‌న‌కు గుర‌వుతున్న అన్న‌దాత‌ల‌పై వ‌రుణుడు క‌రుణించాడు. బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌న ద్రోణితో మంగ‌ళ‌వారం సాయంత్రం నుంచి బుధ‌వారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఉమ్మ‌డి జిల్లా వ్యాప్తంగా వ‌ర్షం కురిసింది. ముఖ్యంగా ఏజెన్సీ జిల్లాలైన ములుగు, మ‌హ‌బూబాబాద్ జిల్లాల్లో విస్తారంగా వ‌ర్షాలు కుర‌వ‌డంతో జ‌ల‌క‌ళ సంత‌రించుకుంది. చాలా మండ‌లాల్లో చెరువుల్లోకి వ‌ర‌ద నీరు పోటెత్తింది. వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి. వ‌ర్షాలు ప‌డ‌టంలేద‌ని రందీ ప‌డుతున్న రైంతాగానికి ఈ రెండు జిల్లాల్లో మాత్రం క‌రువు తీరిన‌ట్లేన‌ని చెప్ప‌వ‌చ్చు. వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ జిల్లాల్లోనూ మోస్తారు వ‌ర్ష‌పాతం న‌మోదైంది. జ‌న‌గామ‌, భూపాల‌ప‌ల్లి జిల్లాల్లో మాత్రం వ‌రుణుడు కరుణించ‌లేదు. జ‌న‌గామ జిల్లాలో స‌గ‌టు వ‌ర్ష‌పాతం 18.8మి.మీ. న‌మోదు కాగా జ‌ఫ‌ర్‌గ‌డ్ మండ‌లంలో 24.0మి.మీ.వ‌ర్ష‌పాతం న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. జిల్లాపై వ‌రుణుడు మొహం చాటేయ‌డంతో రైతులు ఆందోళ‌న చెందుతున్నారు. వ‌ర్ష‌పాతం లోటు అధికంగా ఉండ‌టం, కాలం గ‌తించి పోతుండ‌టంతో పంట‌ల సాగుపై రైతుల్లో దిగులు క‌న‌బ‌డుతోంది.

మ‌హ‌బూబాబాద్‌, ములుగు జిల్లాల్లో జ‌ల‌క‌ళ‌..!

మ‌హ‌బూబాబాద్ జిల్లాలోని కొత్త‌గూడ‌, గంగారం, గూడూరు, మ‌హ‌బూబాబాద్, బ‌య్యారం మండ‌లాల్లోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. బ‌య్యారం పెద్ద చెరువు, బ‌య్యారం అట‌వీ ప్రాంతంలోని బీఎన్‌ గుప్త ప్రాజెక్టు మ‌త్త‌డిప‌డుతున్నాయి. బయ్యారం మండలంలోని కోయగూడెం, సుద్దరేవు నుంచి కంబాలప‌ల్లికి వెళ్లే ప్ర‌ధాన ర‌హ‌దారిపై పంది పంపుల వాగు, మసివాగు రెండు పోటెత్తడంతో సుద్దరేవు గ్రామ సమీపంలో ప్రధాన రోడ్డుపై వ‌ర‌ద ఉధృతి పెరిగింది. రెండు గ్రామల మధ్య రాక పోకలు గంట‌ల పాటు నిలిచిపోయాయి. బ‌య్యారం అట‌వీ ప్రాంతంలోని పందిపంపుల జ‌ల‌పాతం, గూడూరు మండ‌లం సీతానాగ‌రంలోని భీముని పాదం జ‌ల‌పాతం ప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్నాయి. ములుగు జిల్లాలో తాడ్వాయి, మంగ‌పేట‌, ఏటూరునాగారం, వాజేడు, నూగూరు వెంక‌టాపురం మండ‌లాల్లో రికార్డు వ‌ర్ష‌పాతం న‌మోదైంది. ఏటూరునాగారం మండ‌లం రామ‌న్న‌గూడెం వ‌ద్ద గోదావ‌రి ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. తాడ్వాయి మండ‌లం మేడారం వ‌ద్ద జంప‌న్న వాగు వ‌ద్ద క్ర‌మంగా నీటి ప్ర‌వాహ ఉధృతి పెరుగుతోంది. మంగపేట మండలవ్యాప్తంగా రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా మల్లూరు, రమణక్కపేట గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల నివాసాల్లోకి వచ్చిన వరద నీరు చేరింది.

ఉమ్మ‌డి జిల్లాలో ఇదీ వ‌ర్ష‌పాతం లెక్క‌..!

ములుగు జిల్లాలో స‌గ‌టు వ‌ర్ష‌పాతం 103.4మి.మీ.వ‌ర్ష‌పాతం న‌మోదు కాగా అత్య‌ధికంగా రామ‌ప్ప వెంక‌ట‌పురం మండ‌లంలో 220.7మి.మీ., ఏటూరునాగారం 185.1మి.మీ., మంగ‌పేట‌లో 146.3మి.మీ., గోవింద‌రావుపేట మండ‌లంలో 138.1మి.మీ., వ‌ర్ష‌పాతం న‌మోదైంది.మ‌హ‌బూబాబాద్ జిల్లాలో స‌గ‌టు వ‌ర్ష‌పాతం 55.0మి.మీ.లుగా న‌మోదు కాగా అత్య‌ధికంగా కేస‌ముద్రం మండ‌లంలో 99.5మి.మీ,లు, కొత్త‌గూడ మండ‌లంలో 92.4 మి.మీ, గంగారం మండ‌లంలో 75.5మి.మీలు న‌మోదైంది. భూపాల‌ప‌ల్లి జిల్లాలో 53.9మి.మీ వ‌ర్షపాతం న‌మోదైంది. అత్య‌ధికంగా రేగొండ మండ‌లంలో 34.9మి.మీ.వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

వ‌రంగ‌ల్ జిల్లాలో స‌గ‌టు వ‌ర్ష‌పాతం 42.5మి.మీ.గా న‌మోదు కాగా చెన్న‌రావుపేట మండ‌లంలో అత్య‌ధికంగా 89.2మి.మీ.వ‌ర్ష‌పాతం న‌మోదైంది. హ‌న్మకొండ జిల్లాలో స‌గటు వ‌ర్ష‌పాతం 40.4మి.మీ.వ‌ర్ష‌పాతం న‌మోదు కాగా భీమ‌దేవ‌ర‌ప‌ల్లి మండ‌లంలో అత్య‌ధికంగా 128.8మి.మీ.వ‌ర్ష‌పాతం న‌మోదైంది. జ‌న‌గామ జిల్లాలో స‌గ‌టు వ‌ర్ష‌పాతం 18.8మి.మీ. న‌మోదు కాగా జ‌ఫ‌ర్‌గ‌డ్ మండ‌లంలో 24.0మి.మీ.వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

Next Story