వంగర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌పై నిర్లక్ష్యం

by Ratna Kumari |

భీమదేవరపల్లి మండలం వంగరలో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పనులు సంవత్సరాలుగా నిలిచిపోవడం పై బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కండె సుధాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వంగర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌పై నిర్లక్ష్యం
X

దిశ, భీమదేవరపల్లి : భీమదేవరపల్లి మండలం వంగరలో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పనులు సంవత్సరాలుగా నిలిచిపోవడం పై బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కండె సుధాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం విలేక‌ర్ల‌తో మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం, యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించడం లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ₹47.5 కోట్ల అంచనా వ్యయంతో 242.71 ఎకరాల్లో ప్రారంభించిందని గుర్తు చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని.. ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం బాధాకరమని విమర్శించారు. 2025 ప్రారంభంలోనే పర్యావరణ అనుమతులు వచ్చినప్పటికీ, మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.


ప్రస్తుతం ప్రాజెక్టు స్థలం పిచ్చిమొక్కలు, చెట్లతో నిండి అడవిని తలపించే పరిస్థితికి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. వంగర దేవాలయానికి చెందిన సుమారు 4 ఎకరాల భూమిని సేకరించినప్పటికీ, ఆ భూమికి సంబంధించిన నిధుల వినియోగంపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలోనే బోర్లు, బావులు, మామిడి తోటలకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించినప్పటికీ, ఇంకా కొంతమంది రైతులు అదే భూమిలో మామిడి తోటల సాగు కొనసాగించడం వెనుక అధికారుల నిర్లక్ష్యం లేదా ఇతర ప్రయోజనాలు ఉన్నాయా అనే సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వందలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా, ప్రాంతీయ రైతులకు తమ పంటలకు మెరుగైన మార్కెట్, గిట్టుబాటు ధరలు లభిస్తాయని ఆయన చెప్పారు. కాబట్టి పీవీ నరసింహారావు జ్ఞాపకార్థంగా నిర్మిస్తున్న విజ్ఞాన వేదికతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పనులను యుద్ధ ప్రాతిపదికన పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి అవసరమైన నిధులు విడుదల చేసి పనులను వేగవంతం చేయాలని కోరారు. “భారతరత్న పీవీ నరసింహారావు జన్మభూమిపై కనీస గౌరవం చూపకుండా ప్రాజెక్టును ఇలా నిర్లక్ష్యం చేయడం తగదు. వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రజల తరఫున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం” అని హెచ్చరించారు.

Next Story