- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నత్తనడకన మక్కల కొనుగోళ్లు.. నెక్కొండలో అన్నదాతల అవస్థలు!
నెక్కొండ మండలంలో మక్కజొన్న కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. పాత టోకెన్ల రద్దు, కొత్త వాటి జారీతో కొనుగోళ్ల ప్రక్రియ ఆలస్యమవుతోంది. అకాల వర్షాల వల్ల కల్లాల్లోని పంట తడిసిపోతుండడంతో రైతులు దిగులు చెందుతున్నారు.

నెక్కొండ మండలంలో మొక్కజొన్న కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. పాత టోకెన్ల రద్దు, కొత్త వాటి జారీతో కొనుగోళ్ల ప్రక్రియ ఆలస్యమవుతోంది. అకాల వర్షాల వల్ల కల్లాల్లోని పంట తడిసిపోతుండడంతో రైతులు దిగులు చెందుతున్నారు. గన్నీ బ్యాగులు సకాలంలో అందక రైతులు సొంతంగా కొనుగోలు చేయాల్సి వస్తోంది. హమాలీ చార్జీలు, ట్రాక్టర్ కిరాయిల వల్ల రైతుపై ఆర్థిక భారం పెరుగుతోంది. ఒక్కో రైతుకు సుమారు రూ.5వేల అదనపు ఖర్చు అవుతోంది. రోజుకు కేవలం కొద్దిమంది రైతుల మక్కలు మాత్రమే లోడ్ చేస్తున్నారు. వాహనాలు, హమాలీలను పెంచి త్వరగా మక్కలు తరలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
- దిశ, నెక్కొండ
దిశ, నెక్కొండ : వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో మొక్కజొన్న కొనుగోళ్లు నిదానంగా సాగుతున్నాయి. దీంతో కల్లాల్లో పడిగాపులు కాస్తూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల ఇప్పటికే కల్లాల్లోని పంట కొద్దిమేర తడిసిపోయింది. అధికారుల పర్యవేక్షణ లోపం, టోకెన్ల పంపిణీలో గందరగోళం కారణంగా మక్కల కొనుగోళ్లు నత్తనడకను తలపిస్తున్నాయి.
టోకెన్ల ప్రహసనం.. కొనుగోళ్లలో జాప్యం..
15రోజుల కింద పనికెర గ్రామ సమీపంలో మక్కలు నిల్వ చేసిన రైతులకు టోకెన్లు జారీ చేశారు. అయితే, ఇప్పుడు పాత టోకెన్లను రద్దు చేసి మళ్లీ కొత్తగా టోకెన్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రోజుకు 20మంది రైతులకు టోకెన్లు ఇస్తున్నప్పటికీ, కేవలం ఐదుగురు రైతులకు సంబంధించిన మక్కలు మాత్రమే లోడింగ్ అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వచ్చే సూచనలు ఉండడంతో కాంటాలు వేయడంలో జరుగుతున్న జాప్యం పట్ల అన్నదాతలు భయాందోళన చెందుతున్నారు.
రైతులపై అదనపు భారం...
మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపట్టినప్పటికీ క్షేత్రస్థాయిలో రైతులకు తిప్పలు తప్పడం లేదు. సకాలంలో గన్నీ బ్యాగులు అందకపోవడంతో పంట నీటిపాలు కాకూడదని రైతులు ఒక్కో బ్యాగును రూ.25 వెచ్చించి సొంతంగా కొనుగోలు చేస్తున్నారు. దీనికి తోడు ఎకరాకు సుమారు రూ.2వేల ఖర్చు, ట్రాక్టర్ కిరాయి రూ.2,500, హమాలీ చార్జీలు లోడింగ్‌కు బస్తాకు రూ.60, అన్‌లోడింగ్‌కు రూ.10 అదనంగా వసూళ్లు చేస్తున్నారు. దీంతో ఒక్కో రైతుపై రూ.5వేలకు పైగా అదనపు భారం పడుతోంది. ప్రభుత్వం గన్నీ బ్యాగుల డబ్బులు ఇస్తామంటున్నా ఇతర ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయని రైతులు వాపోతున్నారు.
అధికారులు స్పందించాలి
- వీరన్న, నెక్కొండ తండా
గత నెల 24నే మక్కలు కొనుగోలు కేంద్రానికి తెచ్చాను. అప్పుడు ఇచ్చిన టోకెన్ రద్దు చేసి ఇప్పుడు కొత్తది ఇచ్చారు. అకాల వర్షాల భయం వెంటాడుతోంది. అధికారులు వెంటనే స్పందించి హమాలీల సంఖ్యను, ట్రాన్స్‌పోర్ట్ వాహనాలను పెంచి వేగంగా కాంటాలు వేయాలి.






