నియోజకవర్గాల్లో నేతల సొంత టీమ్.. సీఎం వంద రోజుల ప్రణాళికపై దృష్టి!

by Jakkula.Mamatha |

ఉమ్మడి జిల్లాలో ప్రజా ప్రతినిధులు సొంత టీమ్ పై నజర్ పెట్టారు.

నియోజకవర్గాల్లో  నేతల సొంత టీమ్.. సీఎం వంద రోజుల ప్రణాళికపై దృష్టి!
X

దిశ,వరంగల్ బ్యూరో: ఉమ్మడి జిల్లాలో ప్రజా ప్రతినిధులు సొంత టీమ్ పై నజర్ పెట్టారు. తమ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో పర్యటించడంతో పాటు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. పనిచేయని అధికారులను బదిలీ చేయించడంతో పాటు తమకు అనుకూలంగా ఉండే అధికారులను తెచ్చుకుంటున్నారు. పదవీకాలం రెండేళ్లు పూర్తి కావడం, మళ్లీ ఎన్నికలకు రెండున్నరేళ్ల సమయం ఉండటంతో అభివృద్ధి పనులపై దృష్టి పెడుతున్నారు. నియోజకవర్గంలో తమదైన ముద్ర వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్న పదవీకాలంలో భారీగా నిధులు తెచ్చుకొని అభివృద్ధి పనులు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

12 నియోజకవర్గాల్లో పట్టు కోసం..

ఉమ్మడి జిల్లా పరిధిలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండగా ఇద్దరు బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో ఒకరు కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తుండగా ఒకరు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్, ఉప ఎన్నికలు, గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి. అన్నింటిలోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది. అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులే ఎక్కువగా విజయం సాధించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మాత్రమే ఉండగా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల పైన దృష్టి పెట్టింది.

సీఎం ఆధ్వర్యంలో వంద రోజుల ఎజెండాను ముందుకు తెచ్చింది. మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు. నిత్యం పనులపై దృష్టి పెట్టే అవకాశం ఉండటంతో ఎమ్మెల్యేలు కూడా అప్రమత్తం అయ్యారు. అసెంబ్లీకి ఎన్నికై రెండేళ్లు పూర్తి కావడం, పనులు మంజూరు కావడంతో ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులపై దృష్టి పెట్టారు. నియోజకవర్గాల్లో ని మండలాలు, గ్రామాలు, మున్సిపాలిటీల వారీగా పనులను సమీక్షించడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమీక్షిస్తున్నారు. అభివృద్ధి పనుల కోసం నిధులు తీసుకురావడంతో పాటు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.

అనుకూల అధికారుల నియామకం..

కొన్ని నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో అనుకూలంగా అధికారులు పనిచేయకపోవడంతో కొత్తవారిని తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఉన్న వారిని బదిలీ చేయించడంతో పాటు సొంత టీమ్ తయారు చేసుకుంటున్నారు. వచ్చే రెండున్నర ఏళ్లు ఎమ్మెల్యేలకు కీలకం కావడంతో నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టులు, రోడ్లు ఇతర పనులను చేపడుతున్నారు. వీటన్నింటికి మండలాల్లో పనిచేసే అధికారులే కీలకం కావడంతో ఆ శాఖలపై దృష్టి పెట్టారు. రెవెన్యూ, పంచాయతీ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్, ఆర్ అండ్ బీ, , పోలీస్, వ్యవసాయం, వైద్య ఆరోగ్య శాఖతో పాటు ఇతర శాఖల అధికారులను తెచ్చుకుంటున్నారు.

గతంలో ఈ నియోజకవర్గంలో పనిచేసి ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులను గుర్తించి బదిలీపై తీసుకువస్తున్నారు. తమకు అనుకూలంగా పనులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అధికార పార్టీ కావడంతో కోరుకున్న అధికారులను కూడా ఉన్నతాధికారులు ఆయా నియోజకవర్గాలకు బదిలీ చేస్తున్నారు. ఇప్పటి వరకు కొన్ని నియోజకవర్గాలకు అధికంగా నిధులు రాకపోవడంతో ఇప్పుడు ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టి పెట్టి తెచ్చుకుంటున్నారు. ఇచ్చిన హామీలకు అనుకూలంగా పనులు చేయడంతో పాటు ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. మరో రెండున్నర నెలల్లో వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు రానుండటంతో దాని పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో భారీగా పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. సీఎం సమీక్షించనుండటంతో ఎమ్మెల్యేలందరూ వంద రోజుల పాటు నియోజకవర్గాల్లోనే ఉండే పరిస్థితి కనిపిస్తుంది.

Next Story