నా మాట వినవా..నీ సంగతి చెప్తా… ఆర్టీసీలో మహిళా ఉన్నతాధికారి వేధింపులు

by Disha Web Desk 23 |
నా మాట వినవా..నీ సంగతి చెప్తా… ఆర్టీసీలో మహిళా ఉన్నతాధికారి వేధింపులు
X

దిశ,నర్సంపేట : న‌ర్సంపేట ఆర్టీసీలో ఉన్నతాధికారిని వేధింపులకు పాల్పడుతోందంటూ మ‌హిళా ఉద్యోగులు ఆవేద‌న చెందుతున్నారు. డిపోలో కీల‌క బాధ్య‌త‌ల్లో ఉన్న అధికారిణి దురుసుగా వ్యవహరించడమే కాకుండా అనవసర పనిష్మెంట్ల‌కు గురి చేస్తోంద‌ని వాపోతున్నారు. అధికారిణి తీరుపై ఉన్న‌తాధికారుల వ‌ద్ద‌కు వెళ్లి ధైర్యంగా చెప్ప‌లేక కింది స్థాయి మ‌హిళా ఉద్యోగులు, మ‌హిళా కండ‌క్ల‌ర్లు మాన‌సిక వేద‌న‌కు గుర‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే దిశ‌ను ఆర్టీసీ ఉద్యోగులు ఆశ్ర‌యించ‌డం గ‌మ‌నార్హం. సాధారణ విధులతో పాటుగా అద‌న‌పు విధుల‌ను ప‌నివేళలు దాటాక కేటాయిస్తున్న‌ట్లు వాపోతున్నారు.

మ‌హిళా ఉద్యోగుల విష‌యంలో రాత్రి 9గంట‌ల త‌ర్వాత కూడా డ్యూటీలు వేస్తున్న‌ట్లు వేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అధికారిణి చెప్పిన‌ట్లుగా విన‌కున్నా, కొంత అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లుగా క‌నిపించినా.. మ‌రు నాడు నుంచి మ‌రింత ప‌నిష్మంట్లు పెరుగుతున్నాయ‌ని, సిబ్బందిపై అధికారం ఉపయోగించి వేధింపులకు పాల్పడటం రివాజుగా మారిందన్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నారు. న‌ర్సంపేట‌ ఆర్టీసీ డిపోలోని అధికారిణి ప‌నితీరుపై ఉద్యోగుల్లో ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది.

నా మాట వినవా..నీ సంగతి చెప్తా..!

నర్సంపేట ఆర్టీసీలో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్న తన మాట కాదన్నందుకు ఓ మహిళా ఉద్యోగిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన‌ట్లు స‌మాచారం. అధికారం ఉపయోగించి 18 రోజుల పాటు స‌ద‌రు మ‌హిళా కండ‌క్ట‌ర్ డ్యూటీ చార్ట్ క్యాన్సల్ చేసి ఇబ్బందులకు గురి చేసిన‌ట్లు ఆర్టీసీ ఉద్యోగుల ద్వారా తెలిసింది. ఈ ప‌రిణామంతో సిబ్బందిపై అధికారిణి క‌క్ష సాధింపు చ‌ర్య‌లకు దిగుతోంద‌న్న వాద‌నకు బ‌లం చేకూరుతోంది. కొన్ని రోజుల కిందట నర్సంపేట ఆర్టీసీలో కండక్టర్ విధులు నిర్వహించే ఒక మహిళా ఉద్యోగి రోజులాగే విధులకు ఉదయం 6.40 నిముషాలకు హాజరైంది. సాయంత్రం 7 గంటలకు డ్యూటీ దిగింది. అనంతరం రోజులాగే క్యాష్ కట్టడానికి క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళింది. ఈ క్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారి ట్రాఫిక్ ఉందని చెప్పి మళ్లీ హన్మకొండకు వెళ్లాలని వేరే బస్, డ్రైవర్ ని ఇచ్చి వెళ్ళాలని హుకుం జారీ చేసింది.

చేసేదేం లేక హనుమకొండ రూట్ వెళ్ళింది. తిరిగి రాత్రి 9.30కు నర్సంపేట బస్టాండ్ కి చేరుకుంది. అప్పటికే ఆలస్యం కావడం, ఇంటి దగ్గర పిల్లలు వేచి చూస్తున్నారని ఆవేదనలో డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లే క్రమంలో మరోమారు ఉన్నతాధికారి నుండి పిలుపు రావడంతో సదరు మహిళా ఉద్యోగి వెళ్ళింది. మరలా ట్రాఫిక్ ఉందని మరో బస్ ని పాయింట్ పై పెట్టి టికెట్స్ తీసుకుని ఇంటికి వెళ్లాలని ఆదేశించ‌డంతో స‌ద‌రు ఉద్యోగిని షాక్‌కు గురైంది. ఇప్పటికే ఆలస్యం అయిందని, అప్పటికే అక్కడ ఉన్న కాండక్టర్ కి సూచించాలని చెప్పడం, పొద్దున 6.40కి డ్యూటీ ఉందని గుర్తు చేయడం ఉన్నతాధికారి ఆగ్రహానికి కారణమైంది. వాస్తవానికి సాయంత్రమే సదరు మహిళా ఉద్యోగి డ్యూటీ పూర్తయింది. అయినప్పటికీ ఉన్నతాధికారి ఆదేశాలతో అదనంగా డ్యూటీ సైతం చేసింది. కేవలం తన మాట వినలేదన్న అక్కసుతో మరుసటి రోజు నుండి దాదాపు 18 రోజుల పాటు రెగ్యులర్ డ్యూటీ చార్ట్ ని క్యాన్సల్ చేశారు. డిపో స్పేర్ లో డ్యూటీ చేయించినట్లు తెలుస్తోంది.

ఇది చాలదన్నట్లు మొదటి నాలుగు రోజులు విధులకు హాజరైన ఆబ్సెంట్ వేసినట్లు బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో తన మాట కాదన్నదన్న కారణంగా ఛార్జ్ షీట్ సైతం అందజేసింది. అనంతరం రెగ్యులర్ విధుల్లోకి తీసుకున్నప్పటికీ రెండు సంవత్సరాల ఇంక్రిమెంట్ పోస్ట్ పోన్ చేసి సదరు మహిళా ఉద్యోగిపై కక్ష తీర్చుకుంది. ఈ సంఘటనపై మహిళా ఉద్యోగి పై అధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా చేయని తప్పుకు రెండు ఏండ్ల ఇంక్రిమెంట్ పోస్ట్ పోన్ చేయడం ద్వారా నెలకు దాదాపు రూ.700 సహా మిగతా అలవెన్సులు కట్ అవనున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీలో పని చేస్తున్న కింది స్థాయి సిబ్బంది పట్ల సదరు ఉన్నతాధికారి వ్యవహరిస్తున్న తీరుకు ఇదొక మచ్చుతునక మాత్రమే. కిందిస్థాయి సిబ్బంది సంక్షేమం పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన ఉన్నతాధికారి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story

Most Viewed