ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

by Jakkula.Mamatha |

ప్రీ ప్రైమరీ తరగతులకు జిల్లా వ్యాప్తంగా గల ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలో అనుమతులిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
X

దిశ, నర్సంపేట: ప్రీ ప్రైమరీ తరగతులకు జిల్లా వ్యాప్తంగా గల ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలో అనుమతులిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఎంపిక చేసిన పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజు రోజుకూ తగ్గుతుండటం, విద్యార్థులను ప్రభుత్వ విద్యా వ్యవస్థ లోకి మొదటి నుండే తీసుకురావాలన్న ఆలోచనతోనే ప్రీ ప్రైమరీ తరగతుల ఏర్పాటుకు బీజం పడినట్లు సమాచారం. ప్రతి పాఠశాలలో 30 మందికి మాత్రమే అవకాశం ఇవ్వనున్నారు. యూకేజీ స్థాయిలో ఉండే ఈ సిలబస్ ను ఎన్.సీ.ఈ.ఆర్.టీ నిపుణులతో తయారు చేయించారు. నాలుగేళ్లు నిండిన వారికి ఏడాది పాటు కనీస అభ్యసన నైపుణ్యాలు నేర్పిస్తారు. అనంతరం వీరిని ఒకటో తరగతికి పంపిస్తారు.

దరఖాస్తుల స్వీకరణ..

2025-26 విద్యా సంవత్సరానికి గానూ వరంగల్ జిల్లా వ్యాప్తంగా 32 పాఠశాలలను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. యూకేజీ స్థాయిలో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు బోధించడానికి ప్రతి పాఠశాలకు ఒక ఇన్స్ట్రక్టర్, విద్యార్థుల కోసం ఒక ఆయాను తాత్కాలిక పద్ధతిలో నియమించనున్నారు. ఇంటర్ అర్హతతో ఇన్స్ట్రక్టర్ పోస్ట్ ఉండగా, ఆయాకు ఏడో తరగతిగా నిర్ణయించారు. సెప్టెంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 4 గంటల లోగా స్థానిక ఏం.ఈ.ఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వీటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా గ్రామ పంచాయతీ పరిధిలోనే నివాసం ఉన్న వారై ఉండాలన్న నిబంధన ఉంది. దరఖాస్తు సమర్పించేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరై రెండు సెట్ల జిరాక్స్ ప్రతులను జత చేయవలసిందిగా సూచించారు. ఈ పోస్టుల ఎంపిక స్థానికత, మెరిట్ ఆధారంగా చేయనున్నారు.

జిల్లా వ్యాప్తంగా 32 పాఠశాలలు..

వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రీ ప్రైమరీ తరగతుల కోసం 32 పాఠశాలలు ఎంపికయ్యాయి. అందులో నర్సంపేట నియోజకవర్గానికి చెందినవి 18 ఉన్నాయి. డివిజన్ లో అత్యధికంగా దుగ్గొండి మండలం లో 6 పాఠశాలలు, నెక్కొండ 4, నల్లబెల్లి 3, చెన్నారావుపేట 3, ఖానాపురం 1, నర్సంపేట 1 ఉన్నాయి. వీటితో పాటుగా వరంగల్ లో 4, రాయపర్తి 4, ఖిలా వరంగల్ 2, పర్వతగిరి 1, సంగెం 1, గీసుకొండ 1, వర్ధన్నపేట 1 ఉన్నాయి. దరఖాస్తుదారులకు ఎలాంటి సందేహాలున్నా మండల విద్యాశాఖ అధికారి (ఎం.ఈ.ఓ ) కార్యాలయంలో సంప్రదించవచ్చు.

Next Story