ఆర్టీసీ కార్మికుల ప‌ట్ల ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్య వైఖ‌రి అవ‌లంభిస్తోంది : మాజీ ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి

by Ratna Kumari |

ఆర్టీసీ కార్మికుల ప‌ట్ల ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్య వైఖ‌రి అవ‌లంభిస్తోంది అని మాజీ ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆర్టీసీ కార్మికుల స‌మ్మెకు ఆయ‌న సంఘీభావం తెలిపారు.

ఆర్టీసీ కార్మికుల ప‌ట్ల ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్య వైఖ‌రి అవ‌లంభిస్తోంది :  మాజీ ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి
X

దిశ‌, ప‌ర‌కాల : ఆర్టీసీ కార్మికుల ప‌ట్ల ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్య వైఖ‌రి అవ‌లంభిస్తోంది అని మాజీ ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆర్టీసీ కార్మికుల స‌మ్మెకు ఆయ‌న సంఘీభావం తెలిపారు. ఈ సంద‌ర్భంగా కార్మికుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ కార్మికుల కష్టాలను అర్థం చేసుకోకుండా ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని, కార్మిక నాయకులతో వెంటనే చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో కార్మికుల పాత్ర అతి కీలకమని అలాంటి కార్మికులను ఇబ్బందులకు గురి చేయడం దురదృష్టకరమని అన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ఎంతకాలం కార్మికులను మభ్యపెడతారని ప్రశ్నించారు. రాష్ట్ర సాధనలో అగ్రభాగాన ఉన్న ఆర్టీసీ కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తున్నదన్నారు. ఎండల్లో తమ డిమాండ్లను నెరవేర్చాలని శాంతియుతంగా నిరసన తెలిపే కార్మికులకు స్వేచ్ఛ హక్కులను కూడా ఈ ప్రభుత్వం కాలరాస్తుందని ధ్వజమెత్తారు.


నీడ కోసం టెంట్లు కూడా వేయకుండా పోలీసులు ఆపడం చాలా దారుణం అని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. ఇప్పటికే కాంగ్రెస్ పాలనలో రైతులు గోసపడుతున్నారని, పండించిన మక్కలకు కనీస మద్దతు ధర ఇవ్వకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం చాలా దారుణం అన్నారు. రైతుబంధు విడతలవారీగా చెల్లిస్తున్న రైతులను మోసం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదన్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావుల పై చేసిన కుట్రలు చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలనలో విద్యార్థుల భవిష్యత్తు గురుకులాల్లో పటిష్టంగా ఉండేదని, పోలీస్ వ్యవస్థతో ఫ్రెండ్లీగా ప్రభుత్వం నిర్వహించిందని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అరాచకపాలన చేస్తూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధుసూదన్ రెడ్డి ,జైపాల్ రెడ్డి ,సాయి తిరుపతి రెడ్డి మాజీ మార్కెట్ చైర్మన్ బండి సారంగపాణి నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాల్లు పాల్గొన్నారు.

Next Story