నిబంధనలకు నీళ్లు.. కర్షకులకు తప్పని కన్నీళ్లు..

by Disha Web Desk 23 |
నిబంధనలకు నీళ్లు.. కర్షకులకు తప్పని కన్నీళ్లు..
X

దిశ, వరంగల్‌ టౌన్ : రైతులు దేశానికే వెన్నెముక. ఇది మీటింగ్ లో, చాటింగ్ లో మారుమోగే నినాదం. కానీ, క్షేత్రస్థాయిలో అంతా విరుద్ధం. అడుగడుగునా అవమానాలు, అదిరింపులు, బెదిరింపులు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోబోతే మార్కెట్లో చిన్నచూపే. హమాలీ నుంచి అడ్తీ వరకు, కాపాలాదారు నుంచి కార్యాలయ సిబ్బంది వరకు కర్షకులంటే చులకన భావమే. నాణ్యత పేరిట కొంత, సాదర పేరిట మరికొంత, ఆనవాయితీ పేరిట ఇంకొంత రైతు సరుకులు నిలువు దోపిడే. ఇదేమిటని అడిగితే కొరకొర చూపులు, అరకొర తూకాలు.. రైతులకే కష్టనష్టాలు. ఇదీ ఏనుమాముల మార్కెట్లో రైతులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితి. అధికారులు, వ్యాపారులదీ ఒక రకమైన దోపిడీ అయితే, హమాలీ.. కూలీలది మరో రకమైన మోసం. మొత్తానికి రైతులకే కుచ్చుటోపి పెడుతూ చివరకు కర్షకుల పైనే దురుసుతనం ప్రదర్శిస్తున్నారు. కనీసం తాగునీటి వసతి లేదని ప్రశ్నించినందుకు రైతులపై మార్కెట్‌ సిబ్బంది ఒకరు నోరు పారేసుకోవడం.. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద మార్కెట్లో రైతులకు దక్కుతున్న అవమానానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.

అసలు మార్కెట్‌కు రైతులే మూల బిందువు. వారే లేకపోతే మార్కెట్‌లో అధికారులు, వ్యాపారులు దుమ్ము, చెత్తాచెదారం తూకం వేసుకోవాల్సిందే. అలాంటిది రైతుల పట్ల అధికారులు, వ్యాపారుల తీరు విస్మయానికి గురి చేస్తోంది. ధర తగ్గిందన్నా పట్టించుకునే వారు ఉండరు. హమాలీలు సరుకులు లాకుంటున్నారన్న కన్నెత్తి చూడరు.. మార్కెట్లో జీరో దందా సాగుతోందన్నా సంకలో చేతులు తీయరు.. గేటు దాటుతున్న సంచులు పట్టుకోరు..! సూపర్‌వైజర్లు అవినీతి పాల్పడుతున్నారని తెలిసినా చర్యలు చేపట్టడానికి చేతులు రావు. రోజుకు 24వేల మందికి సరిపడ నీరు అందించే వాటర్‌ ప్లాంట్లు ఉన్నా.. వేల రూపాయలు పోసి.. బయటి నుంచి మినరల్‌ వాటర్‌ క్యాన్లు కొనుగోలు చేసే మార్కెట్‌ అధికారులు.. మార్కెట్‌ కార్యదర్శి రిటైర్‌మెంట్‌ ఫంక్షన్‌ ఏర్పాట్లకు తహతహలాడే సూపర్‌వైజర్లు.. మార్కెట్‌కు ఆదాయ వనరైన రైతుకు గుక్కెడు నీళ్లు అందుతున్నాయా? లేదా? మార్కెట్లో రైతుల సరుకుకు భద్రత ఉన్నదా? లేదా? రైతుల సరుకుకు సరైన ధర దక్కుతున్నదా? లేదా? పట్టించుకోకపోవడం వారి పొట్ట మీద వారికున్న దురాశగానే చెప్పుకోవాలి.

గుడిముందు అడుక్కునే వాడు రూపాయి వేసినా.. ఆ వ్యక్తిని దేవుడిగానే చూస్తాడు.. కానీ, వేలల్లో వేతనాలు తీసుకోవడానికి కారణభూతులైన రైతుల పట్ల చులకన భావంతో చూడడం విద్యావంతులైన అధికారుల విజ్ఞతకే తెలియాలి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, రైతులకు మార్కెట్లో ఎదురవుతున్న అవమానకర పరిస్థితులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. అదే అధికారంతో మార్కెట్లో కనీస సౌకర్యాల కల్పనకు తక్షణ చర్యలు చేపట్టేలా చూడాలి. గత ఏడాది ఇదే సమయంలో అప్పటి కార్యదర్శి రైతులకు మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేశారు. ప్రస్తుతం ఎండలు మండిపడుతున్నా... కార్యదర్శి సంగయ్య.. తన రిటైర్‌మెంట్‌ సంబరాల్లో మునిగి ఉన్నారేమో.. గుర్తు చేసి.. రైతుల దాహార్తికి తగిన వసతులు కల్పించాలి. ఇక మార్కెట్లో చోటుచేసుకుంటున్న అవినీతి, అక్రమాలపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి.. మార్కెట్‌ కార్యకలాపాలను సజావుగా సాగేలా చూడాల్సిన అవసరాన్ని జిల్లా ఉన్నతాధికారులు తమ బాధ్యతగా గుర్తించాలి.

Next Story

Most Viewed