నకిలీ దందాకు మళ్లీ రెక్కలు

by Elthuri vijay kumar |   (  Updated:2025-09-07 10:55:51  IST  )

ములుగు జిల్లా నుంచి అక్రమంగా తరలుతున్న ఇసుక

నకిలీ దందాకు మళ్లీ రెక్కలు

- బయటపడిన నకిలీ వేబిల్లులు

- టీజీఎండీసీ, లారీ ఓనర్ల కనుసన్నల్లో వేబిల్లుల ముద్రణ?

- ములుగు జిల్లా నుంచి అక్రమంగా తరలుతున్న ఇసుక

- సెప్టెంబర్ 25న పస్రా చెక్ పోస్టు వద్ద పట్టుబడిన లారీలు

- పట్టించుకోని టీజీఎండీసీ, టాస్క్ ఫోర్స్ అధికారులు

దిశ, మంగపేట : వరంగల్ పోలీస్ కమిషనర్ గా రంగనాథ్ ఉన్న సమయంలో 2023 ఏప్రిల్ 02న టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో బయటపడ్డ నకిలీ వే బిల్లుల ఇసుక దందా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సంచలనంగా మారింది. నాటి నుండి కొంత కాలంగా సద్దు మణిగినా ఈ వ్యవహారం 2025 సెప్టెంబర్ 26న ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా టోల్ గేట్ చెక్ పోస్టు వద్ద జరిగిన తనిఖీల్లో మళ్లీ వెలుగులోకి వచ్చి శాఖాపరమైన కేసు నమోదు చేసి చర్యలు లేకుండా సద్దుమణగడంతో ఈ దందా కొనసాగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం, మంగపేట మండలాల్లోని ఇసుక క్వారీలు నడుస్తుండగా వెంకటాపురం మండలం సీతారామపురం గిరిజన ఇసుక క్వారీ పేరుతో ఈ నకిలీ వే బిల్లులు సృష్టించి ఇసుక లోడింగ్ మాత్రం యాకన్నగూడెంలో చేయించినట్లు విశ్వసనీయ సమాచారం. నకిలీ వే బిల్లులతో ఇసుక రవాణా చేస్తున్న టీఎస్30టిఏ 3579, టీఎస్08యుఈ 8869 అనే లారీలు ములుగు జిల్లా వెంకటాపురం మండలం సీతారామపురం గిరిజన ఇసుక క్వారీ నుండి వస్తున్నట్లుగా ఉన్న నకిలీ వే బిల్లు చెక్ పోస్టు సిబ్బంది బయటపెట్టారు. లారీలను పట్టుకున్న చెక్ పోస్టు సిబ్బంది నిభందనల మేరకు వాటిపై శాఖాపరమైన కేసును నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కొంత కాలంగా నివురుకప్పిన నిప్పులా ఉన్న ఈ వ్యవహారం అనూహ్యంగా ఒరిజినల్ వే బిల్లులను పోలిన నకిలీ కలర్ వే బిల్లులు బయటపడడంతో దీని వెనుక ఎవరున్నారనేది సంచలనంగా మారింది. టీజీఎండీసీ, లారీ ఓనర్ల కనుసన్నలలోనే హైద్రాబాద్ కేంద్రంగా నకిలీ వే బిల్లుల ముద్రణతో అక్రమ ఇసుక దందా మూడు లారీలు ఆరు ట్రిప్పులుగా సాగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ములుగు జిల్లాలోని ఇసుక క్వారీల నుండి నిత్యం వందలాది లారీల ఇసుకను తరలిస్తుండగా వాటిలో ఏది నకిలీదో ఏది ఒరిజనలో అనే తేడాలను గుర్తించేందుకు వీలు లేకుండా కేటుగాళ్లు జరుపుతున్న నకిలీ కలర్ వే బిల్లుల దందాతో ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆర్ధిక నష్టం జరుగుతున్నట్లు తెలుస్తుంది. నకిలీ కలర్ వే బిల్లుల దందాలో వారికి టీజీఎండీసీ ఉన్నత స్థాయి అధికారులు కొందరు రాజకీయ నాయకులు అండగా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చెక్ పోస్టుల్లో కానీ రెవెన్యూ, పోలీస్ ఇతర అధికారులు కానీ ఏ మాత్రం గుర్తించలేకుండా ఉన్న నకిలీ కలర్ వే బిల్లుల దందాతో సహజ సందపను దోచుకుంటున్న కేటుగాళ్ల పని పటక్టేందుకు టీజీఎండీసీ అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులు ఎందుకు దృష్టి సారించడంలేదో ఎవ్వరికీ అర్థం కాని చిక్కు ప్రశ్నగా మారింది.

అంతా మామూ(ల్లే)నా..

ములుగు జిల్లాలోని ఇసుక రీచ్ ల నుండి నకిలీ వే బిల్లుల దందా యథేచ్ఛగా సాగుతుందనడానికి సెప్టెంబర్ 26న పట్టుకున్న నకిలీ వే బిల్లుల లారీలే నిదర్శనంగా నిలుస్తాయి. గతంలోఉమ్మడి వరంగల్ జిల్లా కమిషనర్ రంగనాథ్ టైంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు వరంగల్ రింగ్ రోడ్డు, హన్మకొండలోని రాంపూర్, ములుగు జిల్లాలోని ములుగు, మల్లంపల్లి, పస్రా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నకిలీ వే బిల్లులతో తరలివెల్తున్న లారీలను గుర్తించారు. రాష్ట్రంలో ముఖ్యంగా హైద్రాబాద్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాల్లో ఇసుక వినియోగం ఉండడంతో ప్రభుత్వం వెసులుబాటునిచ్చింది. దీన్ని ఆసరా చేసుకున్న కొందరు లారీ ఓనర్లు టీజీఎండీసీలోని కింది ఉన్నత స్థాయి అధికారుల అండతో నకిలీ వే బిల్లులతో ఆయా నగరాలకు ఇసుక రవాణా దందాకు తెరలేపినట్లు సమాచారం. బిల్లుల్లో ఉండే టైంతో సంబంధం లేకుండా ఇసుక క్వారీల్లో పని చేసే టీజీఎండీసీ సిబ్బందితో లారీ ఓనర్లు, డ్రైవర్లు కుమ్మక్కై నెలల తరబడి నకిలీ కలర్ వే బిల్లులతో ఇసుకను తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

ఫారెస్టు అధికారుల అప్రమత్తతతోనే!

ఈ నెల 26న ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా టోల్ గేట్ చెక్ పోస్టు వద్ద ఫారెస్టు అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా టీఎస్30టిఏ 3579, టీఎస్08యుఈ 8869 అనే నెంబర్ గల ఇసుక లారీలు నకిలీ వే బిల్లులతో ఉన్నట్లు గుర్తించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నకిలీ వే బిల్లులతో ఇసుక జీరో దందా సాగిస్తున్న లారీలను పట్టుకున్నారు. దీంతో ములుగు జిల్లాలోని ఇసుక రీచ్ ల నుండి ఇసుక మాఫియా నకిలీ కలర్ వే బిల్లు దందా మళ్లీ కొనసాగిస్తూ జిల్లా కేంద్రాలను దాటిస్తున్నట్లు వెలుగులోకొచ్చింది.

అక్రమార్కుల జేబుల్లోకి ప్రభుత్వ ఆదాయం ..?

నకిలీ కలర్ వే బిల్లుల దందాతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అక్రమార్కుల జేబుల్లోకి వెల్తుందనే విమర్శలున్నాయి. ఈ నకిలీ వే బిల్లుల దందాను ప్రోత్సహిస్తున్న టీజీఎండీజీలోని కొంత మంది అధికారులతో ప్రభుత్వం అబాసుపాలవుతుందనే విమర్శలూ లేకపోలేదు. గోదావరి పరివాహక ప్రాంతాలైన కాళేశ్వరం, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కొందరు రాజకీయ నాయకుల అండదండలు అందిస్తుండడంతో అడ్డూ అదుపులేకుండా బెదిరింపులే లక్ష్యంగా సాగుతుండడంతో అధికారులు సైతం భయాందోళన చెందుతూ అక్రమార్కులకు అండగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఇసుక పాలసీలోని ప్రభుత్వ నిభందనలు పకడ్బందీగా అమలుకు నోచకపోవడంతో పాటు క్షేత్రస్థాయిలో తనిఖీలు లేకపోవడంతో నకిలీ వే బిల్లుల దందా అక్రమార్కులకు ఆదాయంగా మారిందనేది జగమెరిగిన సత్యం..

నో రెస్పాన్స్..

ఈ విషయమై టీజీఎండీసీ ఏటూరునాగారం పీవో విష్ణువర్దన్ ను వివరణ కోరేందుకు పలు మార్లు సంప్రదించగా ద్విచక్ర వాహనంపై ఉన్నానని కొంత సమయంలో మీతో మాట్లాడతానంటూ స్పందించలేదు. సుమారు రెండు గంటలుగా పలు ధపాలు పోన్లు చేసిన నో రెస్పాన్స్...

Next Story