పత్తి కొనుగోళ్లు బంద్​

by velandi.Saikiran |

కాటన్ అసోసియేషన్ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలో నిలిచిపోయిన కొనుగోళ్లు వరంగల్ ఏనుమాముల మార్కెట్ లో పత్తిని కొనుగోలు చేయని

పత్తి కొనుగోళ్లు బంద్​
X

దిశ, వరంగల్ బ్యూరో: ఉమ్మడి జిల్లాలో పతి కొనుగోళ్లు నిలిచిపోయాయి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్తగా తెచ్చిన నిబంధనలు సడలించాలని వ్యాపారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు పిలుపు నివ్వడంతో కొనుగోళ్లను నిలిపివేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఏ మార్కెట్, జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు జరగలేదు. వరంగల్ ఏనుమాముల మార్కెట్ లో పత్తిని వ్యాపారులు కొనుగోలు చేయలేదు. సీసీఐ నిబంధనలను ఎత్తివేయాలని వ్యాపారులు కొనుగోళ్లను నిలిపివేశారు. పత్తి కొనుగోళ్లను వ్యాపారులు నిలిపివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి కొనుగోలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

నిబంధనలు సడలించాలి..

సీసీఐ కొత్తగా తెచ్చిన నిబంధనలను సడలించాలని రాష్ట్ర కాటన్ అసోసియేషన్ వ్యాపారులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు పత్తి కొనుగోళ్లను నిలిపివేశారు. ఉమ్మడి జిల్లాలో జిన్నింగ్ మిల్లులను బంద్ చేశారు. సీసీఐ కొన్ని మిల్లులను నోటిఫై చేయడం కొంత మందికే అవకాశం ఇవ్వడంతో వ్యాపారులు కొనుగోళ్లను నిలిపివేశారు. ఏ మార్కెట్ పరిధిలో కూడా సోమవారం పత్తి కొనుగోలు జరగలేదు. నోటిఫై చేసిన జిన్నింగ్ మిల్లుల్లోనూ పత్తిని తీసుకోలేదు. రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్ గా ఉన్న ఏనుమాములలో కూడా పత్తి కొనుగోళ్లను నిలిపివేశారు. నాలుగు రోజుల ముందే ప్రకటించడంతో రైతులు పత్తిని తీసుకురాలేదు. కొద్దిమంది ఉదయం పత్తిని తీసుకొని వచ్చినా కొనడం లేదని తిప్పి పంపారు. సీసీఐ కొత్తగా తెచ్చిన నిబంధనలతో తాము నష్టపోతున్నామని గడిచిన నెలన్నర రోజులుగా ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నారు. సీసీఐ చైర్మన్ ను కూడా కలిసి విన్నవించారు.

మిల్లుల కేటగిరిని నిలిపివేయాలని, కపాస్ కిసాన్ యాప్ లో సడలింపులు ఇవ్వాలని వారు కోరుతున్నారు. సీసీఐ అన్ని మిల్లులకు అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఇచ్చిన ఆదేశాల మేరకు గత శుక్రవారం వరకు పత్తి కొనుగోలు చేశారు. ప్రస్తుతం సీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కొనుగోళ్లను నిలిపివేశారు. తమ సమస్యలు పరిష్కరించేంతవరకూ కొనుగోలు చేయమని ప్రకటించారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి సీసీఐ నిబంధనలను సడలించి సమస్యలను పరిష్కరించాలని వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అన్ని కాటన్ మిల్లులకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ సంవత్సరం నిబంధనలను సడలించి కపాస్ కిసాన్ యాప్ నమోదును మినహాయించాలని కోరుతున్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సమస్య పరిష్కరించిన తర్వాతనే కొనుగోలు చేపడుతామని ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేత రవీందర్ రెడ్డి తెలిపారు.

ఇబ్బందులు పడుతున్న రైతులు, మిల్లర్లు

సీసీఐ కొత్తగా తెచ్చిన నిబంధనలతో రైతులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా నమోదు చేసుకోవడంతో పాటు స్లాట్ బుక్ చేసుకోవాలని కోరడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. కపాస్ కిసాన్ యాప్ లో పంట విస్తీర్ణం, దిగుబడి, వివరాలు నమోదు చేసుకొని స్లాట్ బుక్ చేసుకున్న తేదీనే మార్కెట్ కు తీసుకువచ్చి అమ్మకాలు చేయాలి. లేదా జిన్నింగ్ మిల్లుకు తీసుకువెళ్లి అమ్ముకోవాలి. వీటితో పాటు సీసీఐ కొత్తగా తీసుకువచ్చిన ఎకరాకు 7 క్వింటాళ్ల నిబంధన కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది. కపాస్ కిసాన్ యాప్ నమోదు, 7 క్వింటాళ్ల నిబంధన, తేమ శాతం వంటి నిబంధనలతో రైతులు అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాపారులకు అమ్మకాలు చేస్తున్నారు. పత్తి కొనుగోళ్లను నిలిపివేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని సీసీఐ మొత్తం పత్తిని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

పత్తి చుట్టూ ముదురుతున్న రాజకీయం...

సీసీఐ తెచ్చిన నిబంధనలతో పత్తి చుట్టూ ఉమ్మడి జిల్లాలో రాజకీయ ముదురుతుంది. సీసీఐ నిబంధనలు, వ్యాపారుల కొనుగోళ్లు నిలిపివేత, అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ అంశానికి తెర లేపింది. ప్రతిపక్ష పార్టీల నేతలు ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి రైతులను పట్టించుకోకపోవడంతోనే ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తున్నారు. వర్షాలతో ఇప్పటికే రైతులు నష్టపోయారని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు మాత్రం తమది రైతు ప్రభుత్వం అని రైతుకు అనుకూలంగానే కొనుగోలు జరిగే విధంగా చూస్తున్నామంటున్నారు. సీసీఐ కేంద్రం పరిధిలోనిది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నిబంధనలను సడలించాలని కోరుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో రైతులు ఓవైపు ఆందోళన చెందుతుండగా పత్తి అమ్మకాలు మాత్రం రాజకీయ అంశంగా మారింది.

నిలిచిన విక్రయాలు..

సీసీఐ ఆంక్షల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పత్తి క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో సీసీఐ చైర్మన్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఆయన రాష్ట్ర మంత్రితో పాటు వ్యాపారులతో చర్చించనున్నారు. ఆ తర్వాతనే పత్తి కొనుగోళ్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

నేడు ఏనుమాముల మార్కెట్ కు రానున్న హరీష్ రావు...

వరంగల్ ఏనుమాముల మార్కెట్ కు నేడు మాజీ మంత్రి హరీష్ రావు రానున్నారు. మార్కెట్ లో కొనుగోళ్లను పరిశీలించనున్నారు. ఉమ్మడి జిల్లా నేతలతో కలిసి ఆయన మార్కెట్ అధికారులతో చర్చించనున్నారు. ఉమ్మడి జిల్లా రైతులు మాత్రం వ్యాపారులు, సీసీఐ పత్తి కొనుగోళ్లను చేపట్టే విధంగా చూడాలని కోరుతున్నారు.

Next Story