తెలంగాణలో రాక్షస రాజ్య పాలన

by Elthuri vijay kumar |

తెలంగాణలో రాక్షస పాలన సాగుతోందని, రైతులు యూరియా కొరతతో, కాలువల్లో నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు.

తెలంగాణలో రాక్షస రాజ్య పాలన
X

తెలంగాణలో రాక్షస రాజ్య పాలన

- కేసీఆర్ హయాంలోనే రైతు రాజ్యం

- కాంగ్రెస్ అంటేనే కమీషన్లు

- మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

దిశ, వర్థన్నపేట : తెలంగాణలో రాక్షస పాలన సాగుతోందని, రైతులు యూరియా కొరతతో, కాలువల్లో నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఆయన హనుమకొండ జిల్లా అయినవోలు మండలం వెంకటాపురం నుంచి నష్కల్ వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం వర్థన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. “ఎద్దు ఏడ్చిన ఎవుసం! రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డ చరిత్ర లేదు. కేసీఆర్ రైతు రాజ్యం తెస్తే, కాంగ్రెస్ మాత్రం రాక్షస రాజ్యం పాలన చేస్తోందని విమర్శించారు. కేసీఆర్ కాలువల్లో నీళ్లు పారిస్తే, కాంగ్రెస్ కమీషన్ల కోసం కాలువలను ఆపేస్తుందని మండిపడ్డారు. మూడున్నరేళ్ల క్రితం దేవాదుల ప్రాజెక్టుపై టెండర్లు పిలిచినా, ఉప్పుగల్లు, చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్ల పనులు రీ-ఎస్టిమేషన్ల పేరిట ఆగిపోయాయని ఆరోపించారు. ప్రభుత్వం ఇకనైనా మొద్దు నిద్రలేచి ఆ పనులను పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో రూ.104 కోట్లతో మూడు ఎత్తిపోతల ప్రాజెక్టులు మంజూరు అయ్యాయని గుర్తు చేశారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, పార్టీ జిల్లా–మండల నాయకులు, మాజీ, ప్రస్తుత కార్పొరేటర్లు, సోషల్ మీడియా, యువజన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story