- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండు విడతల్లో హస్తం హవా
ఉమ్మడి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థులు మెజార్టీ గ్రామాల్లో గెలుపొందారు.

దిశ, వరంగల్ బ్యూరో: ఉమ్మడి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థులు మెజార్టీ గ్రామాల్లో గెలుపొందారు. మొదటి, రెండవ విడతలో అత్యధిక సర్పంచ్ లను కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థులే గెలువగా, మూడవ విడతపైన ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు దృష్టి పెట్టారు. చివరి విడత ప్రచారం ముగియడంతో అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ధీటుగానే బీఆర్ఎస్ గట్టి పోటీని ఇచ్చింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు విడతల్లో కాంగ్రెస్ తర్వాత అత్యధిక స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. మూడవ విడతలో కూడా అదే రీతిలో పోటీ ఇచ్చి మెజార్టీ స్థానాలు దక్కించుకునేందుకు ఆపార్టీ నేతలు ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు అభ్యర్థులకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి మాత్రం నామమాత్రపు ప్రాధాన్యత దక్కగా స్వతంత్రులు కూడా కొన్ని గ్రామాల్లో గెలుపొందారు.
రెండు విడతల్లో 1118 గ్రామాల్లో ఎన్నికలు..
ఉమ్మడి జిల్లాలో గ్రామ పంచాయతీ రెండు విడతల్లో 1,118 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. మొదటి, రెండవ విడత ఎన్నికల్లో హస్తం మద్దతిచ్చిన అభ్యర్థుల హవా కొనసాగింది. రెండు విడతల్లో దాదాపు 650కి పైగా సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకోగా మరో 50 స్థానాల వరకు కాంగ్రెస్ రెబల్స్ గెలుచుకున్నారు. వీరికి ధీటుగానే రెండు విడతల్లో 350 పైగా గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థులు గెలుపొందారు. మరికొన్ని గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ రెబల్స్ గెలిచారు. ఏకగ్రీవ పంచాయతీల్లో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు సర్పంచులుగా గెలుపొందారు. కొన్ని స్థానాల్లో బీజేపీ గెలుపొందగా అంతకుమించి మిగతా స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు.
పంచాయతీలపై నేతల దృష్టి..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు గ్రామ పంచాయతీలపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గ్రామాల వారీగా ఎంపిక చేయడంతో పాటు వారికి కావాల్సిన మద్దతును ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు అందించారు. తమ నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు. పార్టీ రహితంగానే ఎన్నికలు జరిగిన గ్రామాల్లో కాంగ్రెస్ క్యాడర్ మొహరించారు. మొదటి, రెండవ విడతలో మెజార్టీ సర్పంచులను గెలిపించుకున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులకు భారీగానే ఆర్థిక సహాయాన్ని అందించిన నేతలు మూడవ విడతపై దృష్టి పెట్టారు. ఈ విడతలోనూ అదే ఊపు కొనసాగే విధంగా ప్రయత్నాలను చేస్తున్నారు. తమ నియోజవకర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పట్టు నిలుపుకునే ప్రయత్నాలను చేస్తున్నారు.
కాంగ్రెస్కు ధీటుగా బీఆర్ఎస్..
కాంగ్రెస్ కు ధీటుగానే ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పట్టును నిలుపుకుంటుంది. కాంగ్రెస్ తర్వాత స్థానాల్లో బీఆర్ఎస్అభ్యర్థులే ఎక్కువ మంది గెలుపొందారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల పరిధిలో ఉనికిని కాపాడుకోవడంతో పాటు చాలా గ్రామాల్లో కాంగ్రెస్ కు గట్టి పోటీని ఇచ్చారు. చివరి విడతపైన కూడా దృష్టి పెట్టారు. ఈ ఎన్నికల్లో చాలా గ్రామాల పరిధిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడ్డారు. గ్రామ పంచాయతీల్లో హస్తం హవా కొనసాగగా రెండవ స్థానంలో బీఆర్ఎస్ నిలిచింది. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ రెండు పార్టీల మధ్యనే పోటీ ఉండే పరిస్థితి కనిపిస్తుంది.






