- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డబుల్ వివాదం...ఇండ్ల కేటాయింపుపై లబ్ధిదారుల ఆందోళన
భూపాలపల్లిలో రెండు పడకల గదుల ఇళ్ల కేటాయింపు వివాదాస్పదమైంది. నాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో

దిశ, భూపాలపల్లి ప్రతినిధి : భూపాలపల్లిలో రెండు పడకల గదుల ఇళ్ల కేటాయింపు వివాదాస్పదమైంది. నాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నాయకులు లబ్ధిదారుల వద్ద లక్షల రూపాయలు వసూలు చేసి ఇళ్లు కేటాయించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ నాయకులు అంతకుముందున్న లబ్ధిదారుల జాబితాను రద్దు చేశారు. తమ కార్యకర్తలకు లాటరీ ద్వారా ఇళ్లు కేటాయించడాన్ని ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారు.
జాబితా రద్దు, కొత్త కేటాయింపు
భూపాలపల్లి భాస్కర్‌గడ్డ వద్ద 416 ఇళ్లు నిర్మించారు. గత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమరెడ్డి 416 మందిని ఎంపిక చేసి పట్టాలు పంపిణీ చేశారు. అప్పట్లో కూడా ఎంపికలో డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆ జాబితాను రద్దు చేశారు. రెండు రోజుల కింద కలెక్టర్ కార్యాలయంలో లాటరీ పద్ధతి ద్వారా 408 మందిని ఎంపిక చేశారు. ఈ జాబితాలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇల్లు వచ్చినవారు తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత లబ్ధిదారుల ఆందోళన..
గతంలో ఇళ్లు కేటాయిస్తామని డబ్బులు తీసుకున్న నాయకుల చుట్టూ లబ్ధిదారులు తిరుగుతున్నారు. తమ డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్నారు. పేదలకు కేటాయించిన ఇళ్లు రద్దు చేసి మరలా కేటాయించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇల్లు వచ్చినవారు ఎమ్మెల్యే సత్యనారాయణరావు కాంపు కార్యాలయం ముందు ధర్నా చేశారు. ప్రభుత్వం మారగానే లబ్ధిదారులు మారడం ఏమిటని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇళ్లు పేదవారికి కాకుండా పార్టీ కార్యకర్తలకే ఇవ్వడం పట్ల ప్రభుత్వం తీరును విమర్శిస్తున్నారు.
కోర్టుకు ఆశ్రయం...
గతంలో లబ్ధిదారుల ఎంపికైన వారిని రద్దు చేయడం పట్ల వారు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెబుతున్నారు. గత ప్రభుత్వం కేటాయించిన ధృవపత్రముతో కోర్టు ద్వారా పోరాటం చేస్తామని అంటున్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు.
కేటాయింపులో పారదర్శకత లోపం
ప్రస్తుతం ఇళ్ల కేటాయింపులో జిల్లా కలెక్టర్ పారదర్శకత చూపలేదని పలువురు ఆరోపిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారి జాబితా మొదట కార్యాలయంలో ప్రదర్శించి, అభ్యంతరాలు స్వీకరించి, ఆపై కేటాయించాలనే నిబంధన ఉంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ సాంప్రదాయాన్ని పాటించింది. ప్రస్తుతం ఆ నిబంధనలు పాటించలేదు. కొత్తగా ఎన్నికైన వారిలో ఇల్లు ఉన్నవారు, రెండు మూడు అంతస్తుల భవనాలు ఉన్నవారు సైతం ఉండడం పలు అనుమానాలకు దారితీస్తుంది.
గత పత్రాల రద్దుపై విమర్శలు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేసి, గృహప్రవేశాలు సైతం చేయించింది. అప్పటి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఇళ్ల పత్రాలు కూడా ఇప్పించారు. ఆనాడు ఇప్పించిన పత్రాలను నేడు రద్దు చేయడం ఏమిటని పలువురు ఆరోపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమరెడ్డి విమర్శిస్తూ... గత లబ్ధిదారుల్లో అనర్హులను తొలగించి, వారి స్థానంలో నిరుపేదలకు కేటాయించాలి తప్ప, పూర్తిగా $416$ మందిని తొలగించడం వెనుక కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేయాలనే ఉద్దేశం ఉందని ఆరోపించారు. నిరుపేద కూలీలు సైతం లబ్ధిదారులుగా ఎంపికైన వారిని తొలగించడం సరైన కాదని అన్నారు.
లాభపడుతున్న ద్వితీయ శ్రేణి నాయకులు
శాసనసభ్యుల ఆలోచన ఏ విధంగా ఉన్నప్పటికీ, ఇందులో ద్వితీయ శ్రేణి నాయకులు లాభపడుతున్నారు. ఇళ్లు ఇప్పిస్తామంటూ నాయకులు లబ్ధిదారుల వద్ద లక్ష నుండి రెండు లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో కొంతమంది నాయకులు రూ. $10$ నుంచి $15$ లక్షల వరకు లబ్ధి పొందినట్లు సమాచారం. ఈ విషయంలో పూర్తిస్థాయిలో విచారణ జరిపి అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇళ్ల ఎంపికలో ఎలాంటి అవకతవకలు జరగలేదని తెలిపారు.






