- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పత్తి రైతుపై పట్టింపేది?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రకటనలు చేసినా పత్తి రైతుల గోడు పట్టించుకున్న వారు లేరు. జిన్నింగ్ మిల్లుల సమస్యలను

పత్తి రైతుపై పట్టింపేది?
=ఉమ్మడి జిల్లాలో తెల్లబోయిన తెల్ల బంగారం
=నెల రోజులుగా సీసీఐ కొనుగోళ్లు
=నేటికీ ఎత్తి వేయని 7క్వింటాళ్ల నిబంధన
=వ్యాపారులకు విక్రయించి నష్టపోతున్న రైతులు
=తేమ పేరున ధర తగ్గిస్తున్న వ్యాపారులు
దిశ, వరంగల్ బ్యూరో : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రకటనలు చేసినా పత్తి రైతుల గోడు పట్టించుకున్న వారు లేరు. జిన్నింగ్ మిల్లుల సమస్యలను పరిష్కరించిన సీసీఐ అధికారులు పత్తి రైతులను పట్టించుకోవడం లేదు. నెల రోజులుగా పత్తి కొనుగోళ్లను చేస్తున్నా 7 క్వింటాళ్ల నిబంధనను మాత్రం ఎత్తివేయడం లేదు. దిగుబడి ఎక్కువ వచ్చిన రైతుల పత్తిని సీసీఐ కొనుగోలు చేయకపోవడంతో వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయించి నష్టపోతున్నారు. అసలే వర్షాలతో దెబ్బతిన్న రైతులు మద్దతు ధర రాక మరింత నష్టపోతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు చెప్పినాపట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 5.20లక్షల ఎకరాల్లో సాగు
ఉమ్మడి జిల్లా పరిధిలో ఈయేడాది 5 లక్షల 20 వేల ఎకరాల్లో పత్తిసాగు చేశారు. నాల్గున్నర లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. వరంగల్ ఏనుమాముల మార్కెట్ లో గడిచిన నెలన్నర రోజులుగా పత్తి కొనుగోలు జరుగుతున్నాయి. సీసీఐ నెల రోజులుగా కొనుగోలు చేస్తోంది. ఇప్పటి వరకు సీసీఐ, వ్యాపారులు కలిసి 4లక్షల2529 క్వింటాళ్లను కొనుగోలు చేశారు. వ్యాపారులు లూజు పత్తి 45,719 క్వింటాలు, ఇతర పత్తి లక్షా 3,465 క్వింటాళ్లు వ్యాపారులు కొనుగోలు చేశారు. సీసీఐ ఇప్పటి వరకు 2లక్షల 53వేల 161 క్వింటాళ్లను కొనుగోలు చేసింది. ప్రతిరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లను చేస్తున్నారు. ప్రతిరోజు 20వేల క్వింటాళ్ల వరకు కొనుగోళ్లు చేపడుతున్నారు.
సీసీఐ నిబంధనలతో చిక్కు..
= కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈయేడు కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. రైతులు పండించిన పంటలో ఎకరాకు 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిబంధన రైతులకు ఇబ్బందిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం ఎకరాకు సగటున 11.45 క్వింటాల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. గతేడాది వరకు సీసీఐ ఎకరాకు 12 క్వింటాల చొప్పున కొనుగోలు చేసింది. ఈ సంవత్సరం కొత్త నిబంధనలతో రైతులు దిగుబడి వచ్చినా అమ్మే పరిస్థితి లేదు. నిబంధనలు ఎత్తివేసి సీసీఐ కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభఉత్వాలు నిబంధనలు ఎత్తివేస్తామని చెప్పినా సీసీఐ అధికారులు ఇప్పటి వరకు పట్టించుకోలేదు.
వర్షాలకు దెబ్బతిన్న పత్తి..
ఈయేడు వర్షాలతో దెబ్బతిన్న రైతులకు పండించిన పత్తికి ధర రావడం లేదు. సీసీఐ కొనుగోలు చేస్తున్నా పూర్తిస్థాయి మద్దతు ధర పెట్టడం లేదు. కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.8110 నిర్ణయించినా ఇప్పటి వరకు సీసీఐ కొనుగోలు చేసిన పత్తి సగటున రూ.7500 నుంచి రూ.8వేల మధ్య కొనుగోలు చేస్తుంది. తేమ శాతం బట్టి ధరలో కోత విధిస్తుంది. వ్యాపారులు కొనుగోలు చేసే పత్తిలో భారీగా ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. క్వింటాలు రూ.5500 నుంచి రూ.7100 మధ్యనే కొనుగోలు చేస్తున్నారు. జిన్నింగ్ మిల్లుల, వ్యాపారుల సమస్యలు పరిష్కరించిన ప్రభుత్వం రైతుల సమస్యలను మాత్రం ఇప్పటి వరకు పరిష్కరించలేదు. జిన్నింగ్ మిల్లులకు కేటాయింపులు చేసినా రైతులకు మాత్రం నిబంధనలను ఎత్తివేయడం లేదు.






