25న వీఆర్వో, వీఆర్ఏలకు పరీక్ష.. జీపీవో పోస్టుల భర్తీకి ఏర్పాట్లు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-14 13:35:24  IST  )

ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక్క జీపీవో(గ్రామ పాలన ఆఫీసర్) ఉండేలా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఇప్పటికే పూర్వపు వీఆర్వో, వీఆర్ఏల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వారందరికీ స్క్రీనింగ్ టెస్ట్ పెట్టేందుకు సమాయాత్తమవుతున్నది.

25న వీఆర్వో, వీఆర్ఏలకు పరీక్ష.. జీపీవో పోస్టుల భర్తీకి ఏర్పాట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక్క జీపీవో(గ్రామ పాలన ఆఫీసర్) ఉండేలా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఇప్పటికే పూర్వపు వీఆర్వో, వీఆర్ఏల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వారందరికీ స్క్రీనింగ్ టెస్ట్ పెట్టేందుకు సమాయాత్తమవుతున్నది. ఈ నెల 25న పరీక్ష పెట్టనున్నారు. ఇప్పటికే ప్రతి జిల్లాలోనూ పరీక్షా కేంద్రాన్ని ఎంపిక చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. పరీక్ష కేంద్రం, దాని నిర్వహణకు నోడల్ అధికారిని డిప్యూట్ చేయాలని సూచించారు. తొలుత టీజీపీఎస్సీ ద్వారా పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు.

ఐతే పలు పరీక్షల నిర్వహణతో తీరిక లేకుండా ఉన్నారు. ఈ క్రమంలో కలెక్టర్ల నేతృత్వంలోనే ప్రతి జిల్లాలో పరీక్షను పూర్తి చేయనున్నారు. పరీక్ష ఏ పద్ధతిన ఉంటుందన్న అంశంపై అభ్యర్ధులకు సందేహాలు ఉన్నాయి. ఐతే జీపీవో చేయబోయే విధులు, బాధ్యతలపైనే ప్రశ్నలు ఉంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అభ్యర్ధులంతా గతంలో రెవెన్యూ శాఖలో పని చేసిన వారే. వారందరికీ జాబ్ చార్ట్ పై కనీస అవగాహన ఉంది. కఠినతరమైన ప్రశ్నలేవీ ఉండవని తేల్చారు. ఎలాగూ పోస్టుల కంటే దరఖాస్తుల సంఖ్య తక్కువే ఉంది. ఈ క్రమంలో ఎలిమినేషన్ ప్రక్రియ ఉండదని గ్యారంటీ ఇస్తున్నారు. ఐతే ప్రశ్నపత్రాన్ని జేఎన్టీయూ అధికారుల ద్వారా రూపొందించనున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖ, జేఎన్టీయూ అధికారుల మధ్య చర్చలు పూర్తయ్యాయి. పరీక్ష కంటెంట్, అర్హతలు, జాబ్ చార్ట్ వంటివి ఎగ్జామ్ పేపర్ తయారు చేసే వారికి వివరించారు. దాని ఆధారంగానే పేపర్ రూపొందించనున్నారు. ఈ నెలాఖరులోగానే జీపీవోల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.

Next Story