- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: తెలంగాణలో ఓటు చోరీ వార్.. కాక రేపుతున్న బీజేపీ ఎంపీలపై టీపీసీసీ వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో ఓట్ల చోరీ వార్ దుమారం రేపుతున్నది.

దిశ, డైనమిక్ బ్యూరో : జాతీయ రాజకీయాల్లో రచ్చ రేపుతున్న ఓటు చోరీ వివాదం (Vote Theft Controversy) ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లోనూ హాట్ టాపిక్ అవుతోంది. రాహుల్ గాంధీ ఆరోపణలు, ప్రెస్‌మీట్‌తో సంచలనంగా మారిన ఈ ఇష్యూలో తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. ఓట్ల చోరీతోనే తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. తెలంగాణలోనూ ఓటర్ జాబితా సవరణ జరగాలని బీజేపీ (Bjp) కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తన పార్లమెంట్ పరిధిలోని ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య ఓటు చోరీ ఆరోపణలు, ప్రత్యారోపణలు చర్చకు దారితీశాయి.
నిరూపించేందుకు సిద్ధం : కాంగ్రెస్
నిన్న కరీంనగర్ జిల్లాలో జనహిత పాదయాత్ర సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతోనే గెలిచారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడిన ఆయన ఈ విషయంలో మరింత డోస్ పెంచారు. తెలంగాణలో దొంగ ఓట్లపై కచ్చితమైన సమాచారం, పక్కా ఆధారాలు ఉన్నాయన్నారు. కరీంనగర్లో కూడా బండి సంజయ్ దొంగ ఓట్లతోనే గెలిచారనే అనుమానం ఉందన్నారు. లెక్కలు తీస్తే వీరి బాగోతం అంతా బయటకు వస్తుందన్నారు. నిజామాబాద్‌కు వస్తే పక్కా ఆధారాలు సమర్పిస్తానన్నారు. నిజామాబాద్‌లో ఏం జరిగిందో ఎన్నికల కమిషన్ వస్తే నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఈసీ బీజేపీ జేబు సంస్థగా మారిందని ఆరోపించారు.
ఎస్ఐర్ వర్సెస్ ఓటు చోరీ..
ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణలోనూ ఓట్ల చోరీకి కుట్రలు జరిగాయని అందరి కలిసి వారి భరతం పడదామని పిలుపునిచ్చారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు పీఏసీ సమావేశం సందర్భంగా ఓటు చోరీ ప్రచార లోగోను సైతం రిలీజ్ చేశారు. కాంగ్రెస్ ఓటు చోరీతో దాడి చేస్తుంటే కౌంటర్‌గా బీజేపీ ఎస్ఐఆర్ అంశాన్ని తెరపైకి తీసుకువస్తోంది. తెలంగాణలోనూ ఓటర్ల జాబితాను సవరించాలని తాజాగా కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించటం ఆసక్తిగా మారింది. హైదరాబాద్‌లో డబుల్ ఓట్లు లక్షల సంఖ్యలో ఉన్నాయని, సవరణ జరిగితే సిటీలోనే 4 లక్షల ఓట్లు తొలగించాల్సి ఉంటుందని, అందుకే ఎస్ఐఆర్ జరాగాల్సిన అవసరం ఉందని వాదిస్తున్నారు. త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ ఓటు చోరీ, ఎస్ఐఆర్ అంశాలతో కాంగ్రెస్, బీజేపీ మధ్య సాగుతున్న రాజకీయ రణరంగం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
Read More: దేవుని ఉనికిని తిరస్కరించే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతకన్నా ఏమి ఆశించగలం: కేంద్ర మంత్రి బండి సంజయ్






