- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తి
స్వాతంత్ర్య సమరయోధులు చేసిన అమూల్యమైన త్యాగాలు నేటి యువ తరానికి స్ఫూర్తిగా నిలవాలని వి.విజయేంద్ర ప్రసాద్

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తి
- సినీ రచయిత, రాజ్యసభ సభ్యలు వి.విజయేంద్ర ప్రసాద్
యువత భాగస్వామ్యంతోనే వికసిత్ భారత్
- హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ బి.జగదీశ్వర్ రావు పిలుపు
దిశ, తెలంగాణ బ్యూరో: స్వాతంత్ర్య సమరయోధులు చేసిన అమూల్యమైన త్యాగాలు నేటి యువ తరానికి స్ఫూర్తిగా నిలవాలని సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు వి.విజయేంద్ర ప్రసాద్ అన్నారు. జాతీయ పతాకం దేశ ప్రజలందరి భావోద్వేగమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) తెలుగు స్వాతంత్ర్య సమరయోధులపై సాలార్‌జంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఐదు రోజుల ఫోటో ప్రదర్శన గురువారం ప్రారంభమైంది. ప్రముఖ సినీ రచయిత, రాజ్యసభ సభ్యులు వి. విజయేంద్ర ప్రసాద్, హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ బి.జగదీశ్వర్ రావు ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో 1857 సిపాయిల తిరుగుబాటు నుంచి కొమరం భీం, కాళోజీ నారాయణరావు, సంగం లక్ష్మీబాయమ్మ, మఖ్దూం మొహియుద్దీన్, దాశరథి వంటి 40 మంది ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుల జీవిత విశేషాలతో కూడిన చిత్రాలు ఉన్నాయి. జాతీయ పతాకం రూపొందిన తీరును కూడా ఇందులో వివరించారు.
ఆవిష్కరణల భారత్‌గా ఎదిగినప్పుడే ప్రపంచంతో పోటీ:
అనంతరం జరిగిన సదస్సులో ఉపకులపతి ప్రొఫెసర్ జగదీశ్వర్ రావు మాట్లాడుతూ, యువత క్రియాశీల భాగస్వామ్యంతోనే 'వికసిత్ భారత్' సాధ్యమని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అగ్రస్థానంలో నిలవాలంటే నూతన ఆవిష్కరణలు ఎంతో అవసరమని, నేటి యువత ఆ దిశగా దృష్టి సారించాలని సూచించారు. బ్రిటిష్ పాలనకు ముందు భారతదేశం ప్రపంచ జీడీపీలో 16 శాతం వాటాను కలిగి ఉండేదని, దోపిడీ కారణంగా అది 1 శాతం కంటే తక్కువకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్యం అనంతరం భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినప్పటికీ, నిజమైన అభివృద్ధి ఇంకా సాధించలేకపోయామని చెప్పారు. ఈ సందర్భంగా సీబీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ - ఆత్మనిర్భర్ భారత్ అంశంపై వ్యాస రచన, కవితల పోటీలలో విజేతలకు ప్రొఫెసర్ జగదీశ్వర్ రావు, విజయేంద్ర ప్రసాద్ బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ప్రభుత్వ సిటీ డిగ్రీ కళాశాల, వివేక వర్ధిని డిగ్రీ కళాశాల విద్యార్థులు స్వాతంత్ర్య పోరాట యోధులపై కవితలు వినిపించి అందరినీ ఆకట్టుకున్నారు. వారిని విజయేంద్ర ప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు.






