- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. సీఎం రేవంత్ రెడ్డి పక్కా ‘మాస్టర్ పాన్’
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో విజేతగా నిలిచేందుకు సీఎం రేవంత్ రెడ్డి బహుముఖ వ్యూహాన్ని సిద్ధం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరం, శివారు ప్రాంత మూడు ప్రధాన మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ పావులను కదుపుతున్నారు. తమ ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న బీజేపీపై తీవ్రస్థాయిలో దాడిని ప్రారంభించారు. బీజేపీ లక్ష్యంగా సీఎం చేస్తున్న ఆరోపణలు, విమర్శలను తిప్పి కొట్టడంలో ఆ పార్టీ నాయకులు విఫలమవుతున్నారనే ప్రచారం ఉంది. ఇటీవల ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా నగరంలో నిర్వహించిన సభలు కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం తన అభివృద్ధి ప్రణాళికలు, లక్ష్యాలు, ఆలోచనలు, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్న తీరు, ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేయడానికి ఉపయోగపడ్డాయని పార్టీ నాయకులు భావిస్తున్నారు. అదే ఊపును, ఉత్సాహాన్ని కొనసాగించే విధంగా కొంత కాలంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారు. దీంతో బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకతను తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాలు ఉంటున్నాయని పలువురు భావిస్తున్నారు. ఇవి రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఇస్తాయని విశ్లేషించుకుంటున్నారు.
మూడు కార్పొరేషన్లే లక్ష్యం
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు పట్టం కట్టాయి. ఒకటి రెండు గ్రామీణ జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించారు. హైదరాబాద్ నగరంలో మాత్రం ఒక్క సీటూ రాలేదు. కనీసం మంత్రి పదవి ఇద్దామనుకున్నా ఒక్క ఎమ్మెల్యే గెలవని పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ మహానగరంలో కాంగ్రెస్ పార్టీ చాలా వీక్‌గా ఉందని సీఎం రేవంత్ రెడ్డి సహా కీలక నేతలు గుర్తించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన రెండు ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా పకడ్బందీ వ్యూహాన్ని రచించి విజయం సాధించారు. హైదరాబాద్‌లో 150 డివిజన్లు, సైబరాబాద్‌లో 76, మల్కాజ్ గిరి కార్పొరేషన్‌లో 74 డివిజన్లు ఉన్నాయి. శివారు ప్రాంతాలను కలిపి జీహెచ్ఎంసీని మూడుగా విడగొట్టి మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. మూడుగా విభజించిన తరువాత మొదటి సారిగా జరుగుతున్న ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని పట్టుదలతో ఉన్నారు. గత ఎన్నికల్లో జీహెచ్ఎంసీలో రెండు సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో మూడింటిపై మూడురంగుల జెండా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. హైదరాబాద్, పరిసరాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, అక్రమార్కులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్న హైడ్రా, ఫ్యూచర్ సిటీ తదితర అంశాలపై ప్రజల ఆమోదం పొందడం, ఈ ఫలితాలను వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రిహార్సల్స్భావిస్తు్న్నారు.
సెటిలర్ల సెంటిమెంట్
హైదరాబాద్‌లో ఎంఐఎం ప్రభావం ఉంటుందని, అదే సమయంలో సైబరాబాద్, మల్కాజ్‌గిరి మున్సిపాలిటీలను సొంతంగా కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. ఇందు కోసం ఆంధ్రా సెటిలర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఇందులో భాగంగా మైత్రివనం వద్ద మాజీ సీఎం ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటు చేశారని భావిస్తున్నారు. ఎన్ని విమర్శలు ఎదురైనా సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. సెటిలర్ల ఓట్లు తమకు అనుకూలంగా మలుచుకునే వ్యూహమేనని విశ్లేషకులు అంటున్నారు. ఒక వైపు ఓటర్లను మచ్చిక చేసుకోవడం, మరో వైపు ప్రత్యర్థి రాజకీయ పార్టీలపై విరుచకుపడటం, హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయనున్నామో వివరించడం ఇలా బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు.
బీజేపీపై విమర్శనాస్త్రాలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారని, అదే సమయంలో నగరంలో బీజేపీకి పట్టు ఉందని, యువత, ఉత్తరాది ఓటర్లు, మధ్యతరగతి ప్రజలు కొంత బీజేపీ వైపు మొగ్గు చూపుతారనే ఉద్దేశంతో బీజేపీ మీద అటాక్ చేస్తున్నట్లుగా సమాచారం. ఎన్నికల వరకు బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులంతా తమ పార్టీ వైపు వస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇతర పార్టీల నుంచి చేరికలు ఉంటాయని, బీఆర్ఎస్ లక్ష్యంగా చేరికలు ఉంటాయని చెబుతున్నారు. దీంతో ఆ పార్టీని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరంలేదని, ఎమ్మెల్యేలు ఉన్నా... వర్క్ అవుట్కాదని చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది కనుక ఆ పార్టీ విమర్శించినా పెద్దగా ఫలితం ఉండదని చెబుతున్నారు. దీనిలో భాగంగానే బీజేపీపై, కిషన్ రెడ్డి లక్ష్యంగా చేసుకొని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని అంటున్నారు.






