ఆ అంశంలో CM రేవంత్ రెడ్డికి వీహెచ్ లెటర్.. డైలమాలో సర్కార్

by Rajesh |
ఆ అంశంలో CM రేవంత్ రెడ్డికి వీహెచ్ లెటర్.. డైలమాలో సర్కార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రిజర్వేషన్లు పూర్తయ్యాకే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నేతలే ప్రభుత్వాన్ని కోరడం గమనార్హం. దీని వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం జరుగుతుందని వివరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వెంటనే కుల గణన నిర్వహించి, స్థానిక సంస్థల ఎలక్షన్స్‌లో రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఇదే అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. పాపులేషన్ బేసిస్‌లో రిజర్వేషన్లు చాలా అవసరమని, ఆయా వర్గాల ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యమని వివరించారు. కులాల వారీగా సర్వే చేస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీల లెక్కలు తేలతాయని, ఆయా వర్గాలకు మేలు జరుగుతుందని లేఖలో ప్రస్తావించారు.

కేవలం నాలుగు నెలల్లోనే క్యాస్ట్ సెన్సెస్ పూర్తి చేయొచ్చని వీహెచ్ స్పష్టం చేశారు. ఈ సర్వేను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేస్తే పార్టీకీ బెనిఫిట్ జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు దక్కాల్సిన వాటాలు లభిస్తాయన్నారు. అగ్రనేత రాహుల్ గాంధీ లక్ష్యం కూడా జనాభా గణన నిర్వహించి రిజర్వేషన్లు పెంచాలన్నదే అని తెలిపారు. దేశంలోని మూడు కాంగ్రెస్ ప్రభుత్వాలలో కులాల వారీగా సర్వే నిర్వహించిన ప్రభుత్వంగానూ తెలంగాణకు పేరు వస్తుందని వెల్లడించారు. అంతేగాక ఈ ప్రాసెస్ పూర్తి చేస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు మరింత మద్దతు పెరుగుతుందని లేఖలో పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీలోని మెజార్టీ నేతల్లోనూ ఇదే అభిప్రాయం నెలకొన్నది. క్యాస్ట్ సెన్సెస్ చేయడం వల్ల తమ వర్గాలకు మేలు జరుగుతుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు కోరుతున్నారు. ఇటీవల జరిగిన ​అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు తగిన స్థాయిలో సీట్లు రాలేదని, స్థానిక సంస్థల్లోనైనా పెద్దపీట వేయాల్సిందిగా పలువురు లీడర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్‌లో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోయినా, ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా కాంగ్రెస్‌కు సంపూర్ణంగా మద్దతు పలికి, అండగా నిలబడ్డారని నేతలు గుర్తుచేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ వర్గాలన్నీ కాంగ్రెస్ కోసం పనిచేశాయన్నారు.

ఇప్పుడు స్థానిక సంస్థల్లో తగిన స్థాయిలో ప్రాధాన్యత ఇస్తేనే, పార్టీకి మేలు జరుగుతుందని ఓ నేత తెలిపారు. స్థానిక సంస్థల ఎలక్షన్స్‌ను కాస్త ఆలస్యంగానైనా రిజర్వేషన్లు పూర్తి చేసిన వెంటనే పెడితే బెటర్ అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొన్నది. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారా? లేదా మార్పులు చేర్పులు జరుగుతాయా? అనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

Next Story