‘ఇందిరాగాంధీ మదర్‌ ఆఫ్‌ ఇండియా’ : కేంద్ర మంత్రి సురేశ్‌ గోపీ

by Hajipasha |
‘ఇందిరాగాంధీ మదర్‌ ఆఫ్‌ ఇండియా’ : కేంద్ర మంత్రి సురేశ్‌ గోపీ
X

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్రమంత్రి, కేరళ బీజేపీ ఏకైక ఎంపీ సురేశ్‌ గోపి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీని ఆయన ‘మదర్‌ ఆఫ్‌ ఇండియా’గా అభివర్ణించారు. కేరళకు చెందిన కాంగ్రెస్‌ మాజీ సీఎం కె.కరుణాకరన్‌, మార్క్సిస్టు నేత ఈకే నాయనార్‌లు తనకు రాజకీయ గురువులని చెప్పారు. శనివారం సురేశ్‌ గోపి కేరళలోని త్రిసూర్‌లో పర్యటించారు. నగరంలోని కరుణాకరన్‌ స్మారకమైన మురళీ మందిరాన్ని సందర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘నాకు గురు సమానులైన కరుణాకరన్‌కు నివాళులు అర్పించేందుకు ఇక్కడికి వచ్చాను. దీనికి రాజకీయాలను ఆపాదించొద్దు’’ అని విలేకరులకు సూచించారు. ‘‘కరుణాకరన్‌తో నాకు మంచి సంబంధాలు ఉండేవి. ఆయన సతీమణి కల్యాణి కుట్టి నాకు తల్లి లాంటివారు. మార్క్సిస్టు నేత నాయనార్‌, ఆయన భార్య శారద టీచర్‌ను కూడా తల్లిదండ్రులతో సమానంగా భావిస్తాను. కన్నూర్‌లోని నాయనార్‌ నివాసాన్ని ఇటీవలే సందర్శించాను’’ అని సురేశ్ గోపి తెలిపారు. ‘‘కేరళలో కాంగ్రెస్‌ పార్టీకి మూల పురుషుడు కరుణాకరన్‌. పాలనా విషయాల్లో ఆయన సాహసోపేత నిర్ణయాలు తీసుకునేవారు. 2019లోనే మురళీ మందిరాన్ని సందర్శించాలని అనుకున్నాను. అయితే రాజకీయ కారణాల వల్ల అప్పట్లో కుదరలేదు’’ అని ఆయన చెప్పారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో త్రిసూర్ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన సురేశ్ గోపి, సీపీఐ నేత వీఎస్‌ సునీల్‌కుమార్‌పై 74 వేల ఓట్ల తేడాతో గెలిచారు. సురేశ్‌ గోపికి 4.12 లక్షల ఓట్లు రాగా, సునీల్‌ కుమార్‌కు 3.37 లక్షల ఓట్లు వచ్చాయి. కరుణాకరన్‌ తనయుడు, కాంగ్రెస్‌ నేత కె.మురళీధరన్‌కు కూడా 3.28 లక్షల ఓట్లు పడ్డాయి.

Advertisement

Next Story

Most Viewed