బీఆర్ఎస్‌ను తిట్టడానికే అసెంబ్లీకి రేవంత్: వేముల

by Gantepaka Srikanth |

సభలో మాట్లాడేందుకు స్పీకర్ ప్రతిపక్షాలకు అవకాశం కల్పించకపోవడం అన్యాయమని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

బీఆర్ఎస్‌ను తిట్టడానికే అసెంబ్లీకి రేవంత్: వేముల
X

దిశ, తెలంగాణ బ్యూరో: సభలో మాట్లాడేందుకు స్పీకర్ ప్రతిపక్షాలకు అవకాశం కల్పించకపోవడం అన్యాయమని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో స్పీకర్ పక్షపాత వైఖరిని తెలంగాణ సమాజం గమనించిందని.. ప్రశ్నోత్తరాల సమయంలో సుదీర్ఘ ప్రసంగం చేయడం శాసనసభ చరిత్రలో ఇప్పటివరకు లేదని అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం రేవంత్ గంటన్నరపాటు మాట్లాడడం శాసనసభ నిబంధనకు విరుద్ధమని తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని చెబుతూనే.. మూసీ ప్రక్షాళనకు వేల కోట్లు ఎలా ఖర్చు చేస్తారని మాజీ మంత్రి హరీశ్‌రావు అడిగారని.. దీనిపై సీఎం సమాధానం చెప్పకుండా అడ్డగోలుగా మాట్లాడారని పేర్కొన్నారు. సీఎంను విమర్శిస్తే మైక్ ఇవ్వనని స్వయంగా స్పీకర్ చెప్పడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. అందుకే తాము అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించామని.. ఈ విషయాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని కోరారు. కేసీఆర్ 2016లో శాసనసభలో కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని.. ఆ సమయంలో కాంగ్రెస్ సభ్యులు శాసనసభను బహిష్కరించారని వెల్లడించారు.

శాసనసభ నిబంధనలకు విరుద్ధం

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ శాసనసభ నిబంధనలకు విరుద్ధమని కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు స్వయంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క స్పీకర్‌కు ఉత్తరం రాసి, సంతకాలు చేశారని ఆరోపించారు. ఇది కాంగ్రెస్ ద్వంద్వనీతికి నిదర్శనమన్నారు. బీఆర్ఎస్‌కు సైతం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని స్పీకర్‌కు ఉత్తరం రాశామని.. తమకు పీపీటీ అవకాశం కల్పిస్తే సభకు వెళ్తామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో, ఉద్యమ సమయంలోనూ ఇన్ని అవమానాలు ఎదుర్కోలేదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతు నొక్కలేదన్నారు. తమను తిట్టేందుకే సీఎం సభకు వచ్చారని.. క్వశ్చన్ అవర్‌లో 2 గంటలు మాట్లాడుతారా అని నిలదీశారు. గత స్పీకర్ ప్రతిపక్షాలకు తగినంత సమయం ఇచ్చారని.. ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ సభ్యుల గొంతు నొక్కేందుకు పనిచేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో బీఆర్ఎస్ విప్ వివేకానంద, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాధవరం కృష్ణారావు, డాక్టర్ కె.సంజయ్, కాలేరు వెంకటేశ్, మాణిక్‌రావు, విజయుడు పాల్గొన్నారు.

Next Story