అధికారుల ‘జర్మనీ టూర్’పై తీవ్ర దుమారం.. అనర్హుల ఎంపికపై తీవ్ర విమర్శలు

by Kema Shiva Kumar |

తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ అధికారుల జర్మనీ పర్యటనకు సభ్యుల ఎంపిక హాట్ టాపిక్‌గా మారింది.

అధికారుల ‘జర్మనీ టూర్’పై తీవ్ర దుమారం.. అనర్హుల ఎంపికపై తీవ్ర విమర్శలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలను పెంచే లక్ష్యంతో జర్మనీ వెళ్లనున్న అధికారుల బృందం ఎంపిక వివాదాస్పదమవుతోంది. అంతర్జాతీయంగా సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను అధ్యయనం చేసేందుకు ఈ నెల 28న 35 మందితో కూడిన విద్యాశాఖ అధికారుల బృందం జర్మనీ వెళ్లనుంది. ఇందులో సాంకేతిక విద్యాశాఖ నుండి ఏడుగురు సభ్యులను ఎంపిక చేయగా.. పలువురి ఎంపికపై ఆ శాఖలో అంతర్గతంగా తీవ్ర చర్చ జరుగుతున్నది. ఏడుగురు సభ్యుల్లో ముగ్గురు అనర్హులే ఉన్నారంటూ విమర్శలు వస్తున్నాయి. అంతర్జాతీయంగా సాంకేతిక రంగ మార్పులను అధ్యయనం చేయనుండగా.. రిటైర్ అయిన ఇంగ్లీష్ లెక్చరర్ ఏ విధంగా తెలంగాణ సాంకేతిక విద్య విభాగానికి సేవలందిస్తారో అర్థం కావడం లేదని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఎస్బీటెట్ నిధులు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదివరకు ఫిన్లాండ్ టూర్ కు పంపిన వారిలోనూ అనర్హులే ఉన్నారని, వారు ఇప్పటివరకు కూడా టూర్లో అధ్యయనం చేసిన విషయాలను బోర్డులో కనీసం చర్చించలేదని ప్రచారం జరుగుతున్నది.

ప్రధాన రంగాలపై పరిశోధన

ప్రభుత్వ టీచర్లను విదేశాలకు పంపించి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దీని ద్వారా ఆ స్థాయి విద్యను మన రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఒత్తిడిలేని చదువు అందించడంలో పేరు పొందిన ఫిన్లాండ్ తోపాటు అమెరికా, యూకే, సింగపూర్ తదితర దేశాలకు పంపాలని నిర్ణయించింది. ఈ నెల 28 న ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా ఉన్న జర్మనీ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించేందుకు ఈ పర్యటన కు అధికారులు వెళ్లనున్నారు. ముఖ్యంగా టెక్నాలజీ, ఆటోమొబైల్, మెకానికల్, ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) వంటి కీలక రంగాలపై ఈ బృందం ప్రత్యేకంగా పరిశోధన చేయనుంది. అక్కడి విద్యా విధానాలు, పారిశ్రామిక నైపుణ్యాలను మన సాంకేతిక విద్యా విభాగంలో ఎలా అమలు చేయాలనే అంశాలపై ఈ బృందం అధ్యయనం చేయనుంది. ఈ టూర్లో విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఏ. దేవసేనలు కూడా ఉన్నారు.

సభ్యుల ఎంపికపై విమర్శలు

అయితే, అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ విదేశీ పర్యటన కోసం అధికారుల ఎంపిక ఇప్పుడు విమర్శలకు దారితీసింది. ఈ టూర్ కోసం సాంకేతిక విద్యాశాఖ నుండి ఏడుగురిని ఎంపిక చేశారు. అందులో ఒకరు రిటైర్డ్ ఇంగ్లిష్ లెక్చరర్, ఫిజిక్స్ హెడ్, సివిల్ వాళ్లు ఇద్దరు, డిప్యూటీ డైరెక్టర్, ఎలక్ట్రికల్స్ డిపార్టుమెంట్ నుండి ఒకరు ఉన్నారు. అయితే ఇందులో ముగ్గురు అధికారులకు అర్హత లేదనే ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత రంగాలపై కనీస అవగాహన, అర్హత లేని వారిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారంటూ శాఖలోని ఇతర అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. జర్మనీలో టెక్నికల్ ఎడ్యుకేషన్ లో అమలవుతున్న విధివిధానాలు పరిశీలించడంలో సంబంధిత సబ్జెక్టు నిపుణులు తప్పకుండా ఉండాలి. కానీ అర్హులైన నిపుణులను పక్కనబెట్టి, లూప్‌హోల్స్ ద్వారా ఈ ముగ్గురిని చేర్చడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటై ఉంటుందా అని విద్యాశాఖ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది.

Next Story