- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓఆర్ఎస్ విక్రయంపై రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి కీలక వ్యాఖ్యలు
దేశ మార్కెట్లో ఓఆర్ఎస్ పేరిట అమ్ముడవుతున్న పలు నకిలీ డ్రింక్స్ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రామాణికాలకు తగ్గట్లుగా లేవన్న ఆందోళనపై కేంద్రం స్పందించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ మార్కెట్లో ఓఆర్ఎస్ పేరిట అమ్ముడవుతున్న పలు నకిలీ డ్రింక్స్ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రామాణికాలకు తగ్గట్లుగా లేవన్న ఆందోళనపై కేంద్రం స్పందించింది. ఈ అంశంపై గురువారం రాజ్యసభలో సభ్యురాలు సాగరికా ఘోష్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ సమాధానమిచ్చారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఇప్పటికే ఓఆర్ఎస్ పేరిట ఇతర ఆర్టిఫీషియల్ డ్రింక్స్ విక్రయించే ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు సదరు బ్రాండ్ లేదా ప్రోడక్ట్ పేర్లను వెంటనే మార్కెట్ నుంచి ఉపసంహరించాలనే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌ల నుండి కూడా ఈ ఉత్పత్తులను తొలగించాలని స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. అక్టోబర్ 14, 2025న అన్ని రాష్ట్రాల ఫుడ్ సేఫ్టీ కమిషనర్లకు తప్పుడు లేబులింగ్, తప్పుదారి పట్టించే ఆరోగ్య వాదనలపై కఠిన చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశాలు పంపినట్లు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ చట్టం-2006 ప్రకారం తప్పుడు ప్రకటనలతో పాటు తప్పుదారి పట్టించే లేబిలింగ్ నేరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 75 నోటీసులు, షోకాజ్‌లు, సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేసి చర్యలు ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. మార్కెట్లో మిస్‌లేబుల్డ్ ఓఆర్ఎస్ పానీయాల విక్రయాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
ఇంకా విక్రయిస్తూనే ఉన్నారు.. - విజిల్ బ్లోయర్ డా. శివరంజని సంతోష్
దేశంలో తప్పుదారి పట్టించే ఓఆర్ఎస్ పానీయాలపై ఇప్పటికే రీకాల్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ, సమస్య ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదని వైద్య నిపుణురాలు, విసిల్ బ్లోయర్ డా. శివరంజని సంతోష్ ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని కంపెనీలు ఓఆర్ఎస్ పేరిట చేస్తున్న నకిలీ ఓఆర్ఎస్ విక్రయాలపై ఆమె సుదీర్ఘంగా పోరాటం చేశారు. కేంద్రం చర్యలు తీసుకున్నా.. ఈ సమస్యను పూర్తిగా నియంత్రించాలంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ-సీడీఎస్సీఓ కలిసి సంయుక్త నియంత్రణ చట్రాన్ని రూపొందించాలని ఆమె సూచించారు. ట్రేడ్ మార్క్ చట్టంలోని లోపాలు, ఓఆర్ఎస్ వంటి ఔషధ పదాలను కంపెనీలు బ్రాండ్ పేర్లుగా వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. 10 గ్రాములకు పైగా చక్కెర ఉన్న పానీయాలను ఎఫ్ఎస్ఎస్ఏఐ పరిధిలో ఫుడ్ ఉత్పత్తులుగా రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉండటం వల్ల, అవి ఔషధ ప్రమాణాల పరిశీలన నుంచి తప్పించుకుంటున్నాయని ఆమె వివరించారు. అయితే, ఏ ఉత్పత్తి అయినా డబ్ల్యూహెచ్ఓ ప్రామాణికాల ప్రకారం ఓఆర్ఎస్ ఫార్ములేషన్‌నే అనుసరించాలని భారత ఆహార భద్రత నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని ఆమె గుర్తుచేశారు.
కొన్ని కంపెనీలు ఓఆర్ఎస్ పేరును ప్రత్యామ్నాయ అక్షరాలతో, ఉదాహరణకు క్యూఆర్ఎస్ వంటి బ్రాండింగ్‌తో తప్పుదారి పట్టించే విధానాలు అనుసరిస్తున్నాయని, ఇవన్నీ కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ క్రియాశీల పర్యవేక్షణలో గుర్తించాల్సిన ఉల్లంఘనలేనని ఆమె పేర్కొన్నారు. తప్పుదారి పట్టించే ఓఆర్ఎస్ ఉత్పత్తులు డయేరియా వంటి ప్రాణాంతక పరిస్థితుల చికిత్సలో పిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నాయని, ఐదేళ్ల లోపు పిల్లల్లో మరణాల కారణాల్లో డయేరియా 13 శాతం వాటా ఉన్నదని గుర్తుచేస్తూ, ఉద్యమంగా కఠిన నియంత్రణ చర్యలు అత్యవసరమని డా. సంతోష్ హెచ్చరించారు.






