‘లోకల్’ పోల్‌పై కొనసాగుతోన్న అనిశ్చితి.. హైకోర్టులో విచారణ 3 వారాలకు వాయిదా

by Kema Shiva Kumar |

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం తిరిగి తిరిగి మళ్లీ ప్రభుత్వం వద్దకే చేరింది.

‘లోకల్’ పోల్‌పై కొనసాగుతోన్న అనిశ్చితి.. హైకోర్టులో విచారణ 3 వారాలకు వాయిదా
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం తిరిగి తిరిగి మళ్లీ ప్రభుత్వం వద్దకే చేరింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారని దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారించిన హైకోర్టు.. ఈనెల 24కు వాయిదా వేసింది. దీంతో ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని ఎన్నికల కమిషన్‌కు నివేదించాల్సి ఉంటుంది. ప్రభుత్వం రిజర్వేషన్‌‌లు ఖరారు చేసి జాబితా ఇవ్వగానే ఎన్నికలు నిర్వహిస్తామని.. ఈసీ స్పష్టంచేసింది. దీంతో ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. 42శాతం బీసీ రిజర్వేషన్ల అంశం ఇంకా ఎటూ తేలలేదు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, బిహార్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని పలుమార్లు ప్రకటించిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు పాత విధానం(50 శాతం రిజర్వేషన్ల)తోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు. ప్రతిపక్షాలు సైతం దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది. దీంతో బీసీ వర్గాలు కొంత నిరాశ, ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని సర్కార్ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

కేబినెట్ భేటీలో నిర్ణయం..

ఈనెల 7న జరిగే కేబినెట్ సమావేశంలోనూ 50 శాతం పాత రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే అవకాశాలు లేవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవారం రోజులు వాయిదా వేసి ఈనెల 14 తర్వాత నిర్ణయం తీసుకోవచ్చని, అప్పుడు ప్రత్యక్షంగా ఇబ్బంది రాదని, కోర్టులు చెప్పిన ప్రకారం నడుచుకుంటున్నామని చెబితే సరిపోతుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 50 శాతంతోనే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందని, కోర్టులు స్పష్టంగా చెబుతున్నాయి. ఇప్పటికీ కూడా 42శాతం బీసీ రిజర్వేషన్లు అని పాకులాడటం కొంత మభ్యపెట్టడమే అవుతుందని అధికార పార్టీలోని కొందరు వాదిస్తున్నారు.

ఉపఎన్నిక ఫలితాలు రాగానే..

జూబ్లీహిల్స్​ఫలితాలు రాగానే 50 శాతంతో రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు త్వరగా నిర్వహించాలని పార్టీ నాయకులు కోరుతున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు కావడం, నోటిఫికేషన్​ కూడా విడుదల కావడంతో ప్రాథమికంగా అభ్యర్థులు పేర్లు దాదాపుగా ఖరారు చేశారు. దీంతో చివరి నిమిషంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అభ్యర్థులుగా ప్రకటించబడిన పార్టీ నాయకులపై రాను రాను తీవ్ర ఆర్థిక భారం పడునుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ ఒకవైపు, మరోవైపు గ్రామాల్లో జరిగే శుభ, ఆశుభ కార్యాయాలు, పండుగలు, సమావేశాలు, మందు పార్టీలు ఇలా అన్నింటికీ ఖర్చు భరించలేక అభ్యర్థులు సతమతమవుతున్నారు. డబ్బులు లేవని చెప్పలేని పరిస్థితి. తప్పించుకుని తిరిగితే ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వస్తాయేమోనని అనుమానం, పార్టీ టిక్కెట్టు కోసం ప్రత్యర్థులు వేచి చూడటం, ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారానికి రెడీగా ఉండటం వంటి అంశాలతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. నిర్ణయం రాకపోయేసరికి నిరాశకు గురవుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల ద్వారా ఎన్నికల సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వెంటనే ఎన్నికలు అయిపోతే బాగుండని వేడుకుంటున్నారు.

Next Story