ప్రయాణీకులకు TSRTC గుడ్ న్యూస్

by Disha Web Desk 4 |
ప్రయాణీకులకు TSRTC గుడ్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకుల సౌకర్యార్థం బెంగుళూరు, విజయవాడ రూట్‌లలో టికెట్‌పై పది శాతం రాయితీ కల్పించాలని TSRTC నిర్ణయించింది. ఆ రెండు మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై ఈ 10 శాతం డిస్కౌంట్‌ను సంస్థ ఇవ్వనుంది. ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్ని సర్వీసుల్లో ఆదివారం(జూలై 2) నుంచి 10 శాతం రాయితీ అమల్లోకి వస్తుంది. ఈ రాయితీ ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉంటుంది.

విజయవాడ, బెంగళూరు మార్గాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, వారికి ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతోనే పది శాతం రాయితీ కల్పించినట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది. రానూపోను ఒకే సారి బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై పది శాతం రాయితీ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ డిస్కౌంట్ వల్ల విజయవాడ మార్గంలో రూ.50 వరకు, బెంగళూరు మార్గంలో రూ.100 వరకు ఒక్కో ప్రయాణికుడికి ఆదా అవుతుందని వెల్లడించింది.

ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉండే ఈ రాయితీ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనర్‌ కోరారు. ముందస్తు రిజర్వేషన్‌ కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌ http://tsrtconline.in ను సంప్రదించాలని వారు సూచించారు. ఇదిలా ఉండగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్టీసీ తార్నాక ఆస్ప‌త్రిలోని డాక్ట‌ర్ల‌ను ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ ఘ‌నంగా స‌న్మానించారు. తార్నాక ఆస్ప‌త్రిలో శ‌నివారం ఏర్పాటు చేసిన స‌న్మాన కార్య‌క్ర‌మానికి ఆయ‌న ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు. వైద్యుల స‌మ‌క్షంలో కేక్ క‌ట్ చేసి.. వారికి నేష‌న‌ల్ డాక్ట‌ర్స్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. త‌ర్వాత 55 మంది వైద్యులను ప్ర‌శంసా ప‌త్రాలు, జ్ఞాపికలతో సత్కరించారు.



Next Story

Most Viewed