‘నిఘా’ నీడలో ఇక గిరిజన గురుకులాలు.. సీసీ కెమెరాలతో విద్యార్థులకు హైటెక్ భద్రత

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-12 01:44:27  IST  )

తెలంగాణలోని 155 గిరిజన సంక్షేమ గురుకులాల్లో విద్యార్థుల భద్రత, సిబ్బంది సమయపాలన కోసం 1,960 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.

‘నిఘా’ నీడలో ఇక గిరిజన గురుకులాలు.. సీసీ కెమెరాలతో విద్యార్థులకు హైటెక్ భద్రత
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. విద్యార్థులకు సురక్షితమైన, క్రమశిక్షణతో కూడిన విద్యా వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన గురుకులాల్లో అధునాతన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయం విద్యార్థుల తల్లిదండ్రుల్లో కొత్త భరోసాని నింపుతోంది. గురుకులాల్లో విద్యా బోధనతో పాటు, విద్యార్థుల సంక్షేమ బాధ్యత సైతం సొసైటీదే. ఈ క్రమంలో క్యాంపస్‌లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రతి కదలికనూ నిశితంగా గమనించేందుకు ఈ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రవేశ ద్వారాలు, హాస్టల్ గదుల కారిడార్లు, డైనింగ్ హాల్స్, ప్లే గ్రౌండ్స్ వంటి ప్రాంతాలన్నీ ఇప్పుడు నిరంతర సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయి.

సమస్యను గుర్తించేలా..

ఒక వేళా సిబ్బంది సమయపాలన పాటించకపోయినా వెంటనే హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులు వారికి ఫోన్ చేసి ప్రశ్నించే అవకాశముంది. విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తితే సీసీ కెమెరాల్లో వాటిని గుర్తించి గురుకులాల్లో విధుల్లో ఉన్న సిబ్బందికి ఫోన్ చేసి అలర్ట్ చేస్తున్నారు. వంటగదిలోని పరిస్థితులను పరిశీలిస్తూ చోరీ జరిగితే వెంటనే సదరు ప్రిన్సిపల్‌కు సమాచారం అందిస్తున్నారు.

తల్లిదండ్రులకు భరోసా..

సీసీ కెమెరాల ఏర్పాటుతో క్యాంపస్‌లలో క్రమశిక్షణ మరింత మెరుగుపడుతుందని ఉపాధ్యాయులు, సొసైటీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు తమ పిల్లలు క్షేమంగా ఉన్నారనే నమ్మకం తల్లిదండ్రుల్లో కలుగుతోంది. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు లేదా విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గుర్తించాల్సి వచ్చినప్పుడు, ఈ కెమెరాల ద్వారా అధికారులు సకాలంలో స్పందించి, తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. గిరిజన ప్రాంతాల విద్యార్థులు ఉన్నత చదువులు చదివి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ వినూత్న చర్యకు శ్రీకారం చుట్టింది. భద్రతకు భరోసా లభించడం వల్ల విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా కేవలం చదువుపైనే దృష్టి పెట్టే అవకాశం ఏర్పడింది. అధునాతన సాంకేతికతను జోడించి, గురుకులాల్లో విద్యా ప్రమాణాలతో పాటు భద్రతను సైతం పెంచడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

రాష్ట్రంలోని మొత్తం గిరిజన గురుకులాలు - 155

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన గురుకులాలు - 155

మొత్తం సీసీ కెమెరాలు - 1960

ప్రస్తుతం పని చేస్తున్న సీసీ కెమెరాలు - 1168

మైనర్ రిపేర్ చేయాల్సినవి - 488

నిత్యం మానిటరింగ్ చేస్తున్నాం: గురుకులాల సొసైటీ అడిషనల్ సెక్రెటరీ నటరాజ్

‘అన్ని గురుకులాల్లో విద్యార్థుల భద్రత కోసం అత్యాధునిక సాంకేతికత కలిగిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. వాటిని హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేశాం. వీటి ద్వారా ఆడియో సైతం వినవచ్చు. గురుకులాల్లోని ఆఫీస్ రూమ్, తరగతి గదులు, వసతి గృహాలు, డైనింగ్ హాల్స్, ప్లే గ్రౌండ్, ఇతర పరిసరాలు నిఘా నీడలో ఉన్నాయి. నిత్యం మానిటరింగ్ చేస్తూ.. తగు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం కొన్ని సీసీ కెమెరాలు రిపేర్‌లో ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే వినియోగంలోకి తీసుకొస్తాం.’

Next Story