Musi Floods: మూసీ వరద.. 150 మంది ప్రాణాలను కాపాడిన చెట్టు

by Naga Rani Yarlagadda |

గడిచిన ఐదేళ్లలో ఎన్నడూ లేనంత వరద మూసీనదికి పోటెత్తింది. గండిపేట గేట్లు ఎత్తడంతో మూసీకి వరద ప్రవాహం పెరిగింది.

Musi Floods: మూసీ వరద.. 150 మంది ప్రాణాలను కాపాడిన చెట్టు
X

దిశ, వెబ్‌డెస్క్: గడిచిన ఐదేళ్లలో ఎన్నడూ లేనంత వరద మూసీనదికి పోటెత్తింది. గండిపేట గేట్లు ఎత్తడంతో మూసీకి వరద ప్రవాహం పెరిగింది. దీంతో పలు ప్రాంతాల్లోని ఇళ్లు నీటమునిగాయి. ఎంజీబీఎస్ లోకి కూడా వరద రావడంతో.. బస్టాండ్ ను తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. అయితే.. 117 ఏళ్ల క్రితం కూడా మూసీకి భారీగా వరద పోటెత్తగా.. ఓ చెట్టు 150 మందిని కాపాడింది. తాజాగా వచ్చిన వరదలతో ఆ చెట్టు వైరల్ గా మారింది. మూసీని ఆనుకుని ఉన్న ఆ చెట్టు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

1908లో సంభవించిన మూసీ వరదల్లో (The Great Moosi Floods) సుమారు15 వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. 150 మంది ఓ చెట్టు కొమ్మలను పట్టుకుని తమ ప్రాణాలను రక్షించుకున్నారు. ఉస్మానియా ఆస్పత్రి (Osmania Hospital) ఆవరణలో ఉన్న చింతచెట్టుకు ఆనాటి వరదల్లో సహాయపడిందని పేర్కొంటూ ఒక బోర్డును కూడా తగిలించారు. అంతటి ఘనచరిత్ర ఉన్న ఆ చెట్టుకు అప్పటి అధికారులు ప్రాణధాత్రి అనే పేరును కూడా పెట్టడం విశేషం. ఆ ఏడాది సెప్టెంబర్ 26వ తేదీ నుంచి 28 వరకూ 36 గంటల్లో కురిసిన 16 సెంటీమీటర్ల వర్షపాతానికి మూసీ ఉప్పొంగింది. దాదాపు 20 వేల ఇళ్లు నీటమునగగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

Next Story