- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దీక్షా దివస్ పేరిట కొత్త డ్రామా.. పాలనపై చర్చకు సిద్ధం టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సవాల్
రోజురోజుకూ బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతున్నదని.. అందుకే కొత్త డ్రామాకు తెరలేపిందని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రోజురోజుకూ బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతున్నదని.. అందుకే కొత్త డ్రామాకు తెరలేపిందని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. దీక్షా దివస్ పేరిట ప్రజలను మోసం చేయడానికి బీఆర్ఎస్ సిద్ధమైందని అన్నారు. కేసీఆర్ బయటికి వస్తే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. బీఆర్ఎస్ ముగిసిన శకం అని కేసీఆర్ స్వయంగా అర్థం చేసుకున్నారని అన్నారు. ప్రజా సెంటిమెంట్‌ను రాజకీయ లాభం కోసం వాడుకుని కేసీఆర్ కుటుంబమే లబ్ధి పొందిందని ఆరోపించారు. బీఆర్ఎస్ బూటకపు మాటలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అమరుల శవాలపై కేసీఆర్ అధికారం అనుభవించారని.. 2009లో చేసిన దీక్ష పూర్తిగా నాటకమని అన్నారు. ఆయన దీక్ష వల్ల తెలంగాణ రాలేదని.. సోనియా గాంధీ వల్ల రాష్ట్రం వచ్చిందన్నారు. రాష్ట్రం కోసం దీక్ష చేస్తున్నా అని చెప్పి నిమ్స్‌లో ఫ్లూయిడ్స్ తీసుకున్నారని.. ఆధారాలు కూడా ఉన్నాయని.. కేటీఆర్ ఒకసారి చదవాలని సూచించారు. బీఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ముందుగా ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు అర్పించాలని డిమాండ్ చేశారు. 4 లక్షల మంది చస్తే తప్ప తెలంగాణ రాదని కేసీఆర్ పలికిన ప్రగల్భాలు పలికారని.. పార్లమెంట్, జూబ్లీహిల్స్, ఉపఎన్నికల మాదిరిగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ గల్లంతు కావడం ఖాయమని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అనేక వర్సిటీల విద్యార్థులు ఉద్యమానికి ఊపిరిగా నిలిచారని.. విద్యార్థుల ఆత్మబలిదానాలకు స్పందించి సోనియా తెలంగాణ ఇచ్చారని వెల్లడించారు.
రెండేళ్ల పాలనపై చర్చకు సిద్ధం
రెండేళ్ల ప్రజాపాలన అభివృద్ధి పై చర్చకు సిద్ధమని మహేశ్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు డీసీసీ అధ్యక్షులుగా పనిచేశారని.. ఇది కొత్త విషయం కాదని చెప్పారు. నల్లగొండ డీసీపీ కైలాష్ నేత మాట్లాడిన వీడియో మూడేళ్ల క్రితానిది అని.. ఆయన మాటలను సమర్థించమని చెప్పారు. కైలాష్ నేత ఇప్పటికే బహిరంగ క్షమాపణ చెప్పారని తెలిపారు. బీసీల 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని.. రిజర్వేషన్లపై ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులను నిలదీయాలని పిలుపునిచ్చారు.






