నాతో పాటు CM రేవంత్ ఆలోచన కూడా అదే.. మనసులోని మాట బయటపెట్టిన PCC చీఫ్

by Gantepaka Srikanth |

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లిలో తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రైనింగ్ క్యాంప్‌ను టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) ప్రారంభించారు.

నాతో పాటు CM రేవంత్ ఆలోచన కూడా అదే.. మనసులోని మాట బయటపెట్టిన PCC చీఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లిలో తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రైనింగ్ క్యాంప్‌ను టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) ప్రారంభించారు. ఈ సందర్భంగా.. యూత్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి జాతీయ గీతం ఆలపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ భవిష్యత్ రాహుల్ గాంధీ(Rahul Gandhi)దే అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌లో సభ్యత్వం దొరకడం చాలా కష్టమని అన్నారు. యూత్‌ కాంగ్రెస్ ప్రపంచంలోనే పెద్దదని చెప్పారు. పార్టీలో సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎంత మంది ఉన్నా.. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజీవ్ గాంధీ లాగే రాహుల్ గాంధీ కూడా యూత్‌ను ప్రొత్సహిస్తున్నారని అన్నారు.

ఏఐసీసీలో ముఖ్య నేతలంతా యూత్ కాంగ్రెస్‌ నుంచి వచ్చినవారే అని తెలిపారు. హిమాచల్ సీఎం, అరుణాచల్ మాజీ ముఖ్యమంత్రి వంటి నేతలు NSUI నుంచి వచ్చిన వారే అని అన్నారు. ఓపిక.. నిబద్ధత.. క్రమశిక్షణ ఉన్న కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో పదవులు వస్తాయని తెలిపారు. రాజకీయాల్లో కాంప్రమైజ్ కంపల్సరీ.. పరిస్థితులకు తగ్గట్టు సమయానుసారం నడుచుకోవాలని చెప్పారు. వెనక్కి తిరిగి చూడకుండా నిరంతరం కష్టపడాలి.. ఇదే యూత్ కాంగ్రెస్ నేతలకు తానిచ్చే సలహా అని అన్నారు. ప్రజలతో యూత్ కాంగ్రెస్ నేతలు సంబంధాలు కొనసాగించాలని సూచించారు.

పీసీసీ కార్యవర్గంలో యంగ్ బ్లడ్ ఉండాలని నాతో పాటు సీఎం రేవంత్(CM Revanth Reddy) ఆలోచన అని చెప్పారు. ప్రభుత్వ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే బాధ్యత యూత్ కాంగ్రెస్ నేతలపై ఉందని గుర్తుచేశారు. యూత్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాపై ఫోకస్ చేయాలి.. ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని అన్నారు. మొత్తంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి యూత్ కాంగ్రెస్ రక్షణ కవచంలా ఉండాలని అన్నారు. కాంగ్రెస్‌లో ప్రతీ కార్యకర్తకు స్వేచ్ఛ ఉంటుంది.. రాష్ట్ర ముఖ్యమంత్రిని సైతం ప్రశ్నించే హక్కు ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ కార్పొరేషన్ చైర్మన్ శివసేన రెడ్డి, తెలంగాణ యువజన కాంగ్రెస్ ఇంచార్జ్ సురభి, అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story