బ్రేకింగ్: మావోయిస్ట్ అగ్రనేత కటకం సుదర్శన్ కన్నుమూత

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: మావోయిస్ట్ అగ్రనేత కటకం సుదర్శన్ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆనంద్ అలియాస్ కటకం సుదర్శన్ కన్నుమూశారు. గత నెల 31న మధ్యాహ్నం గుండెపోటు రావటంతో పాటు మధుమేహం తీవ్ర అనారోగ్యం కారణంగా ఆయన చనిపోయినట్టు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో తెలిపారు. కటకం సుదర్శన్ మరణంపై పార్టీ కేంద్ర కమిటీ సంతాపాన్ని ప్రకటించినట్టు తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి ఆగస్ట్ 3 వరకు కటకం సుదర్శన్ స్మృతిలో సంతాప సభలు నిర్వహించాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు.

ఇక, తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో ఓ కార్మిక కుటుంబంలో జన్మించిన కటకం సుదర్శన్ బెల్లంపల్లిలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. వరంగల్‌లో పాలిటెక్నిక్ చదివారు. ఆ రోజుల్లోనే ఆయన మావోయిస్ట్ భావజాలానికి ఆకర్షితులయ్యారు. శ్రీకాకుళం పోరాటాల ప్రేరణతో 1974లో మైనింగ్ డిప్లోమా చేశారు. 1975లో రాడికల్ విద్యార్థి సంఘం నిర్మాణంలో సుదర్శన్ కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత బెల్లంపల్లి పార్టీ సభ్యుడిగా ఆయన పనిచేశారు. ఈ సమయంలో సింగరేణి కార్మిక ఉద్యమం, రాడికల్ విద్యార్థి ఉద్యమాల్లో సుదర్శన చురుకైన పాత్ర పోషించారు.

1978లో లక్షెట్టిపేట, జన్నారం ప్రాంతాల మావోయిస్టు పార్టీ ఆర్గనైజర్‌గా రైతాంగ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. 1980లో ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా, 1987లో దండకారణ్య ఫారెస్ట్ కమిటీకి కటకం ప్రాతినిథ్యం వహించారు. 1995లో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కార్యదర్శిగా పనిచేసిన ఆయన.. 2001లో రెండోసారి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సుదర్శన్ సెంట్రల్ రీజనల్ బ్యూరో సెక్రటరీగా 2017 వరకు పనిచేశారు. అనంతనరం పలు అనారోగ్య సమస్యల కారణంగా తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. గెరిల్లా పోరాటంలో దిట్ట అయిన కటకం సుదర్శన్‌ను ఆనంద్‌, మోహన్‌, వీరేందర్‌జీ అని వివిధ పేర్లతో పిలుస్తారు.


Next Story

Most Viewed