- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్మికులపై వేధింపులు లేకుండా చూడాలి.. ప్రభుత్వానికి ఆర్టీసీ టీజేఎంయూ విజ్ఞప్తి
ఆర్టీసీలో యాజమాన్యం వేధింపులు మితిమీరిపోయాయని... ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆర్టీసీ టీజేఎంయూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీలో యాజమాన్యం వేధింపులు మితిమీరిపోయాయని... ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆర్టీసీ టీజేఎంయూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆర్టీసీలో యూనియన్లు లేకపోవడంతో యాజమాన్యం వేధింపులు పెరిగాయని టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. పికెట్ డిపోలో రాజు అనే డ్రైవర్ ను కేఎంపీఎల్ తక్కువగా వస్తుందనే నెపంతో 15 రోజుల ట్రైనింగ్ కు పంపించారని... అయితే ట్రైనింగ్ లో ఎలాంటి వేతనం లేకుండానే పనిచేయాలంటూ యాజమాన్యం ఆదేశాలు ఇచ్చిందని అన్నారు.
గతంలో ఎప్పుడు లేని విధంగా ఆర్టీసీలో యాజమాన్యం వెట్టిచాకిరికి పాల్పడుతోందని ఈ ఘటనే అందుకు సాక్షమని తెలిపారు. డిపో మేనేజర్ల వేధింపులను ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తించాలని కోరారు. బస్సులో అధిక ప్రయాణికులు, ట్రాఫిక్ జామ్, వర్షాలు పడుతున్నప్పుడు నెమ్మదిగా బస్సు నడిపినా కేఎంపీఎల్ తక్కువగా వస్తుందని... ఇందుకు గాను పనిష్మెంట్ పేరిట జీతం లేకుండా ట్రైనింగ్ ఇవ్వడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి కార్మిక వ్యతిరేక విధానాలు లేకుండా చూడాలని ప్రభుత్వానికి హనుమంతు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీలో తిరిగి యూనియన్లను అనుమతించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన సమస్యలు పరిష్కరించాలని కోరారు.






