పాతబస్తీలో మరో మూడు ఫ్లైఓవర్లు.. జీహెచ్ఎంసీ టెండర్ నోటిఫికేషన్ జారీ

by Ramesh Naini |

పాతబస్తీలో మరో మూడు ఫ్లైఓవర్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే నల్గొండ ఎక్స్ రోడ్డు నుంచి ఓవైసీ జంక్షన్ వరకు ఫ్లైఓవర్ పనులు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

పాతబస్తీలో మరో మూడు ఫ్లైఓవర్లు.. జీహెచ్ఎంసీ టెండర్ నోటిఫికేషన్ జారీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: పాతబస్తీలో మరో మూడు ఫ్లైఓవర్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే నల్గొండ ఎక్స్ రోడ్డు నుంచి ఓవైసీ జంక్షన్ వరకు ఫ్లైఓవర్ పనులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే నిత్యం రద్దీగా ఉండే హాఫిజ్ బాబా నగర్ జంక్షన్ నుంచి బాలాపూర్ చర్చి రోడ్ వరకు (మెట్రో ఫంక్షన్ హాల్ మీదుగా ఒమర్ హోటల్ నుంచి షోయబ్ హోటల్ వరకు) ఆరు లైన్ల బై డైరెక్షనల్ గ్రేడ్ సెపరేటర్ తో కూడిన ఫ్లై ఓవర్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న ఓవైసీ ఫ్లైఓవర్ కోసం లెఫ్ట్ ఆర్మ్ డౌన్ ర్యాంపు ను కూడా నిర్మించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. దీంతో పాటు బండ్లగూడ నుంచి ఎర్రకుంట క్రాస్ రోడ్డు వరకు ఆరు లైన్ల మరో బై డైరెక్షనల్ ఫ్లై ఓవర్ ను కూడా నిర్మించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసింది.

టెండర్ నోటిఫికేషన్ జారీ..

రూ. 385 కోట్లతో నిర్మించనున్న మూడు ఫ్లైఓవర్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. హెచ్-సిటీలో భాగంగా గ్రేటర్ లో రూ. 7038 కోట్లక పనులను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ టెండర్లు పిలిచింది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి టెండర్లను స్వీకరించేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది. వచ్చే నెల 12న ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించి, 20వ తేదీ వరకు టెండర్లను స్వీకరించనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. టెక్నికల్, ఫైనాన్స్ బిడ్ల ప్రక్రియను పూర్తి చేసిన అనంతరం మార్చి 1వ తేదీ నుంచి పనులను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. ఓవైసీ ఫ్లైఓవర్ కు ర్యాంప్, హాఫిజ్ బాబా నగర్ జంక్షన్ నుంచి బాలాపూర్ చర్చి రోడ్ వరకు, బండ్లగూడ నుంచి ఎర్రకుంట క్రాస్ రోడ్డు వరకు రెండు ఆరు లైన్ల ఫ్లై ఓవర్ల నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే పాతబస్తీ, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బాలాపూర్ తదితర ప్రాంతాలకు రాకపోకలు ఎలాంటి అడ్డంకులు లేకుండా మరింత వేగంగా సాగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.

Next Story