డిజిటల్ అరెస్ట్‌కు పాల్పడిన ముగ్గురు నిందితుల అరెస్ట్

by Ajay Maddhiboyina |

హైదరాబాద్‌కు చెందిన సీనియర్ సిటిజన్‌ను డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులకు పాల్పడి రూ.1.92కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

డిజిటల్ అరెస్ట్‌కు పాల్పడిన ముగ్గురు నిందితుల అరెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన సీనియర్ సిటిజన్‌ను డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులకు పాల్పడి రూ.1.92కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నవంబర్ 7 నుంచి 14వ తేదీ వరకు డిజిటల్ అరెస్ట్ పేరుతో చాగంటీ హనుమంతరావు అనే వ్యక్తి పై బెదిరింపులకు పాల్పడ్డట్టు సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఆధార్ కార్డ్ దుర్వినియోగం చేసిన కేసులో అరెస్ట్ చేస్తున్నట్టు బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ నుంచి నకిలీ ఎఫ్ఐఆర్ పంపి డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్లు సీబీఐ అధికారుల పేరుతో బెదిరింపులకు పాల్పడ్డట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. తాము సూచించిన బ్యాంక్ అకౌంట్ కు డబ్బులు డిపాజట్ చేయాలని కేసు పరిష్కారం అయిన తరువాత రిలీజ్ అవుతాయిని చెప్పి మోసానికి పాల్పడ్డట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.

కేసులో ఏ2 , ఏ3, ఏ4 నిందితులుగా వినిత్ రాజ్ , తిరుపతయ్య, విశ్వనాధంగా గుర్తించారు. వీరి పై దేశ వ్యాప్తంగా 5 కేసులు ఉన్నట్లు, రాష్ట్రంలో రెండు కేసులు ఉన్నట్లు తెలిపారు. నిందితులు ముగ్గురు కూడా తెలంగాణకు చెందిన వారేనని పేర్కొన్నారు. ఏ2 నిందితుడిగా ఉన్న వినిత్ రాజ్(24) నారాయణ పేట జిల్లా మద్దురూకు చెందిన విద్యార్థిగా గుర్తించారు. ఇతను అకౌంట్ సప్లయిర్‌‌ కేసులో నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు. తిరుపతయ్య, విశ్వనాధం ఇద్దరూ మహబూబ్ నగర్ కు చెందినవారని ఇద్దరూ వ్యాపార భాగస్వాములుగా ఉన్నట్లు పేర్కొన్నారు. వీరి జాయింట్ అకౌంట్ ద్వారా లావాదేవీలు జరిపినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు. ప్రధాన నిందితుడిగా పేర్కొన్న సందీప్ అలియాస్ అలెక్స్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని వెల్లడించారు. కేసు నమోదైన రెండు వారాలలో నిందితులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు. వారినుంచి నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసులో దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన ఇన్స్‌పెక్టర్ సతీష్ రెడ్డి, ఎస్ఐ శ్రీకాంత్‌లను డీసీపీ అభినందించారు.

Next Story