- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెప్పపాటులో పరిస్థితులు మారొచ్చు.. తస్మాత్ జాగ్రత్త
మొంథా తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, ఒడిస్సా రాష్ట్రాలపై కూడా పడుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, ఒడిస్సా రాష్ట్రాలపై కూడా పడుతోంది. తుఫాను కారణంగా తెలంగాణలోని (Telangana) జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. మోస్తారు నుంచి భారీ వర్షాలు (Rains) కురుస్తుండడంతో రహదారులు దెబ్బతింటున్నాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా ప్రధాన రహదారుల్లో అడుగు లోతుకు పైగా గుంతలు రోడ్డు ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులు జలమయంతో పాటు బురదమయం అవుతున్నాయి. దీంతో ద్విచక్ర వాహనాల వంటివి జారిపడే అవకాశాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు కట్టలు తెంచుకొని పరవళ్లు తొక్కుతున్నాయి. నీటి ప్రవాహం ఎక్కువ ఉన్న కారణంగా పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో నీటి ప్రవాహాన్ని దాటి అవతలి వైపుకు వెళ్తే ప్రమాదకరం. అకడక్కడా జాతీయ రహదారులపై కూడా కుండపోతగా వర్షం కురుస్తుండడంతో దారి కనిపించే పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి.
ఇటువంటి నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని తెలంగాణ పోలీసులు కోరుతున్నారు. వాతావరణ మార్పుల దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎండా, వానల కలయికతో వాతావరణ మార్పులు జరుగుతున్నాయని, రెప్పపాటులో ఏ క్షణమైన వాతావరణ పరిస్థితులు భయానకంగా మారొచ్చని పేర్కొంటున్నారు. విద్యుత్ స్తంభాలు, పడిపోయిన విద్యుత్ లైన్లకు దూరంగా ఉండాలని కోరుతున్నారు. చెట్ల కింద, శిథిలావస్థకు చేరి గోడల సమీపంలో ఉండొద్దని సూచిస్తున్నారు. తెలియని దారిలో వెళ్లడం కంటే తెలిసిన దారిలో వెళ్లడం మేలంటున్నారు. వరద నీటి ప్రవాహం ఉన్న సమయంలో పిల్లలను ఆడుకోవడానికి బయటకు పంపకూడదని చెబుతున్నారు. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే వారు ప్రభుత్వ సూచనలను, వాతావరణ శాఖ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలని అంటున్నారు. తద్వారా సురక్షితంగా ఉంటూ ప్రయాణం సాగించాలని తెలంగాణ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. పోలీసు శాఖ కూడా సదా ప్రజల సేవలో ఉంటుందన్నారు. పరస్పర సహకారంతో వాతావరణ పరిస్థితుల వల్ల తలెత్తే సమస్యలను ఎదుర్కొందామని ప్రజలకు పిలుపునిస్తున్నారు. అత్యవసర సమయంలో 100 లేదా 112 నెంబరుకు డయల్ చేయాలని కోరుతున్నారు.






