వానొస్తే.. నిద్రుండదు! అల్లీపూర్ బీసీ గురుకుల పాఠశాల దుస్థితి

by Geesa Chandu |   (  Updated:2024-08-12 03:03:13  IST  )

వానొచ్చిందంటే చాలు.. విద్యార్థులకు నింద్రుండదు. చీకటి పడ్డాక, క్లాస్ రూమ్ లోనే ఆపసోపాలు పడి నిద్రించడం.

వానొస్తే.. నిద్రుండదు! అల్లీపూర్ బీసీ గురుకుల పాఠశాల దుస్థితి
X

దిశ, వెబ్ డెస్క్: వానొచ్చిందంటే చాలు.. విద్యార్థులకు నింద్రుండదు. చీకటి పడ్డాక, క్లాస్ రూమ్ లోనే ఆపసోపాలు పడి నిద్రించడం. ఇదే కాదు, వారి పాఠశాలల్లోని టాయిలెట్స్ కు తలుపులు కూడా ఉండవు. ఇలా చెప్తూ పోతే మరెన్నో సమస్యలు.. ఇదీ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ బాలుర బీసీ గురుకుల పాఠశాల దుస్థితి. ఈ పాఠశాలలో 5 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు మొత్తం 380 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాలలో మొత్తం 12 గదులుంటే.. అందులో సగానికి పైగా గదులు రేకుల షెడ్లతో నిర్మించారు. అయితే ఆ రేకులు ప్రస్తుతం పూర్తిగా పగిలిపోయి ఉన్నాయి. అయితే మిగిలిన రోజులు బాగానే నెట్టుకొస్తున్నా.. వానొస్తే మాత్రం క్లాస్ రూములు, డార్మెటరీ గదులు వాన నీటిలో తడిసి చిత్తడిగా మారుతున్నాయి. దీంతో విద్యార్థులు తడిసి ముద్దవుతున్నారు. చలికి వణుకుతున్నారు. దీనికి తోడు రూముల్లో బెంచీల కరువు. ఇంకేం కటిక నేలపైనే విద్యార్థులు చదువుతున్నారు. రాత్రికి అదే నేలపైన పడుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

పాఠశాలలో మొత్తం 12 టాయిలెట్స్ ఉండగా.. వాటికి డోర్లు లేనే లేవు. దీంతో విద్యార్థులు మలమూత్ర విసర్జనకు ఆరు బయటకు వెళ్లాల్సి వస్తుంది. పాఠశాల చుట్టూ కనీసం ప్రహరి గోడ కూడా లేదు. దీంతో లోనికి విష పురుగులు ప్రవేశిస్తున్నాయని, దీంతో మాకు రక్షణ కూడా కరువైందని విద్యార్థులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో డైనింగ్ హాల్ లేక, పాఠశాల ఆవరణలో ఆరుబయట మర్రి చెట్టు కింద కూర్చొని తినాల్సి వస్తుందని పిల్లలు తమ గోడు వెల్ల బుచ్చుకుంటున్నారు. కాబట్టి తమ కనీస అవసరాలను తీర్చడానికి, పాఠశాలకు కావలసినవి సమకూర్చి సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు చెబుతున్నారు.

Next Story