రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు: బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

by Disha Web Desk 7 |
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు: బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని ప్రభుత్వంపై బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. నగరం నడిబొడ్డున జరిగిన ఘటనకు నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే హోంమంత్రి మహమూద్ అలీని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు అర్ధరాత్రి పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపణలు చేసిన గిరిజన మహిళ వడ్త్య లక్ష్మీబాయిని ఆర్ఎస్పీ ఇవాళ ఆస్పత్రిలో పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే, ఆమె పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించిన తీరు అమానవీయమన్నారు.

రాత్రంతా పోలీస్ స్టేషన్‌లో ఉంచి థర్డ్ డిగ్రీ ప్రయోగించి, మహిళపై మోకాళ్లు, పిక్కలు, తొడలపై లాఠీలతో చితకబాదడం దుర్మార్గమన్నారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేవలం బహుజనుల మీదనే దాడులకు పాల్పడుతున్నారు కానీ లిక్కర్ స్కాంలో రూ.100 కోట్లు ముడుపులు చెల్లించిన కవితను మాత్రం ఈడీ పోలీసులు ఆమె ఇంటికి వెళ్ళి విచారించారని విమర్శించారు. దేశంలో ఎక్కడో సంఘటన జరిగితే స్పందించే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నగరంలో జరిగిన సంఘటనకు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ఇటీవల హైదరాబాద్ పాతబస్తీకి చెందిన సామాజిక కార్యకర్త హత్య షేక్ సయీద్ బావజీర్‌ను బండ్లగూడలో హత్యకు గురయ్యాడని గుర్తుచేశారు.

Next Story