- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: బీర్ల తయారీపై ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం.. మార్గదర్శకాలు సిద్ధం
పెద్ద నగరాలకే పరిమితమైన మైక్రో బ్రూవరీస్ ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: పెద్ద నగరాలకే పరిమితమైన మైక్రో బ్రూవరీస్ ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో ఇందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు పరిమితంగా ఉన్న మైక్రో బ్రూవరీలను విస్తృతం చేయాలని తెలంగాణ ఎక్సయిజ్ శాఖ నిర్ణయించింది. వీటి ఏర్పాటు వల్ల ఆదాయం పెంచుకోవచ్చని భావిస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాలకే మైక్రో బ్రూవరీస్ పరిమితమయ్యాయి. మిగతా ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు జనాభా, మున్సిపాలిటీలకు సంబంధించిన వివరాలను ఆబ్కారీ శాఖకు పురపాలక శాఖ అందించింది. దీనితో పాటు ఎంత జనాభా ఉంటే దీనిని ఏర్పాటు చేయాలి? ఏయే నిబంధనలు పాటించాలి? అనే వాటిపై మార్గదర్శకాలు సైతం సిద్ధమయ్యాయి. వీటికి సైతం కేబినెట్ ఆమోదం లభించింది. మైక్రో బ్రూవరీస్ అంటే బీర్లు తయారు చేసిన చోటే వినియోగదారులకు అమ్మడం.
హైదరాబాద్‌లో 18 మైక్రో బ్రూవరీలు
హైదరాబాద్ జంట నగరాల్లో శంషాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో 55కు పైగా పబ్స్ ఉన్నాయి. ఇందులో 18 వరకు మైక్రో బ్రూవరీలు ఉన్నాయి. వీటిల్లో ఏడాదికి 18 లక్షల లీటర్లుకు పైనే బీరును ఉత్పత్తి చేస్తున్నారని అధకారులు చెబుతున్నారు. దేశంలో ఢిల్లీ, బెంగళూరు, చెన్నయ్, పుణెలో మైక్రోబ్రూవరీలు ఎక్కువగా ఉన్నాయి. అదే తరహాలోనే గ్రేటర్ హైదరాబాద్‌లోనూ ఏర్పాటు చేయాలని 2015లోనే డిమాండ్ వచ్చింది. అప్పట్లో అందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. 2016లో 50 కంపెనీలు పోటీపడుతూ దరఖాస్తు చేసుకున్నాయి. అందులో 18 కంపెనీలకు మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు అవకాశమిచ్చారు. ఆ తర్వాత సైతం మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు డిమాండ్ పెరుగుతూనే వచ్చింది.
ప్రతి మున్సిపాలిటీలో..
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 160 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ సహా 16 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కాకుండా మిగిలిన ప్రాంతాల్లోనూ మైక్రో బ్రూవరీల సంస్కృతిని విస్తరించాలని డిమాండ్ ఉన్నది. దీంతో ఇప్పటికే మున్సిపాలిటీల్లో టెర్రస్, సీటింగ్ కెపాసిటీ ఉన్న బార్లు, రెస్టారెంట్లకే బ్రూవరీల ఏర్పాటు అనుమతి ఇవ్వనున్నారు.
ఒక్కో బ్రూవరీకి రూ.3లక్షలు
హైదరాబాద్‌లో ఉన్న మైక్రో బ్రూవరీస్‌లో ఒక్కోదానికి రూ.5లక్షల చొప్పున సర్కారు ఫీజు వసూలు చేస్తున్నది. మున్సిపాలిటీల్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న వాటికి రూ.3 లక్షలు వసూలు చేయాలని నిర్ణయించారు.






