- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో అన్నదాతల దైన్యం.. పంట నష్టపరిహారం కోసం ఎదురుచూపులు
రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవలే రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించింది. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. హెక్టారుకు రూ.6 వేల సాయం అందిస్తామని స్పష్టం చేసింది. మిగతాది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని పేర్కొంది. కానీ రైతులు మాత్రం అప్పులు చేసి పంట సాగుచేశామని, ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.
2.20 లక్షల ఎకరాల్లో పంట నష్టం
మూడు నెలల క్రితం కురిసిన అతి భారీ వర్షాలకు 270 మండలాల పరిధిలోని 2,463 గ్రామాల్లో 2.20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. సెప్టెంబర్ నెలాఖరులో కురిసిన వానలకు నల్ల గొండ, మహబూబ్నగర్, నిజామాబాద్, కామా రెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, జగిత్యాల, కామారెడ్డి, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలో లక్షల ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీటిలో మునిగినట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వీటికి పంట నష్ట పరిహారం ఇచ్చే అంశంపై ప్రభుత్వం నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. గతేడాది ఇచ్చిన దాని కన్నా రెండింతలు పరిహారం పెంచాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నాయి. ప్రస్తుతం విత్తనాలు, కూలీలు, ట్రాక్టర్, ఇతర ఖర్చులు భారీగా పెరిగాయని వాటిని చెల్లించి పంటలు వేశామని తీరా చేతికందే సమయానికి వర్షాలకు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూలై, ఆగస్టులో కురిసిన వానలకు వికారాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, గద్వాల, వనపర్తి, మంచిర్యాల, కుమ్రుం భీం ఆసిఫాబాద్జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబిన్ పంటలకు భారీగా నష్టం వాటిల్లింది.
దిక్కుతోచని స్థితిలో రైతులు
పంటనష్టం వల్ల అప్పులు తీర్చలేక కౌలు రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వేసిన పంటలు ఏపుగా పెరడంతో యూరియా, ఇతర రసాయన ఎరువుల కోసం పెద్దమొత్తంలో ఖర్చు పెట్టారు. తీరా పంట చేతికొచ్చే సమయంలో అంతా వర్షం పాలైంది. దీంతో గతం కన్నా ఎక్కువ పరిహారం అందించిన తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. పట్టాదారులకు కాకుండా పంట సాగు చేసిన వారికి పరిహారం అందించాలని కోరుతున్నారు.
READ MORE ......
మక్కలపై ఎందుకింత చిన్నచూపు.. కొనుగోలు కేంద్రాలెందుకు తెరవరు?






