అసెంబ్లీ వేదికగా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఫైర్.. వివక్షపై ఉదాహరణలతో వెల్లడి!

by Disha Web Desk 2 |
అసెంబ్లీ వేదికగా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఫైర్.. వివక్షపై ఉదాహరణలతో వెల్లడి!
X

దిశ, తెలంగాణ బ్యూరో: గవర్నర్ ప్రసంగంలో కేవలం రాష్ట్ర ప్రగతికి మాత్రమే పరిమితమైన ప్రభుత్వం తన బడ్జెట్ ప్రసంగాన్ని మాత్రం కేంద్రంపై ఆగ్రహం ప్రదర్శించడంతో మొదలుపెట్టింది. ఎనిమిదన్నర సంవత్సరాలుగా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం ఏయే తీరులో ఉన్నదో ఉదాహరణలతో వివరించింది. ఒకవైపు నీతి ఆయోగ్, మరోవైపు 15వ ఫైనాన్స్ కమిషన్, ఇంకోవైపు విభజన చట్టం, వీటన్నింటిని మించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తులు ఉన్నా కేంద్రం ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ ప్రగతిని అడ్డుకుంటున్నదని ఆరోపించింది. అన్నింటింటే కొత్త రాష్ట్రమైనా కేవలం ఎనిమిదిన్నర సంవత్సరాల్లోనే అనేక రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి సంక్షేమం, డెవలప్‌మెంట్‌లో రోల్ మోడల్‌గా నిలిచిందని హరీశ్‌రావు తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. జాతీయ సగటుతో పోలిస్తే అనేక రంగాల్లో తెలంగాణ ఆదర్శంగా ఉన్నదన్నారు.

బహిరంగసభలు, మీడియా సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని, ప్రధాని మోడీని ముఖ్యమంత్రి కేసీఆర్ తూర్పారపడుతుండగా ఇప్పుడు అసెంబ్లీ వేదికగా బడ్జెట్ ప్రసంగాన్ని కూడా కేంద్రంపై విమర్శలకు మంత్రి హరీశ్‌రావు వినియోగించుకున్నారు. కేంద్రంపై విమర్శలతోనే బడ్జెట్ ప్రసంగం మొదలైంది. ఇతర రాష్ట్రాలపై చూపుతున్న ప్రేమను తెలంగాణపై చూపడంలేదని, అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తున్నదని, వివక్ష చూపుతున్నదని, పక్షపాతంతో ఉంటున్నదని ఆరోపించారు. ఈ కారణంగా తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని, అయినా గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నదని, కేంద్రం సహకరించకపోయినా సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టించిందన్నారు.

ఆర్బీఐ రుణాలకు మోకాలడ్డు

గతేడాది బడ్జెట్‌లో రిజర్వుబ్యాంకు ద్వారా బహిరంగ మార్కెట్ రుణాలను సుమారు రూ.53,970 కోట్లను సమీకరించుకునేలా అంచనా వేస్తే కేంద్రం మోకాలడ్డి రూ.15,033 కోట్లకు కోత పెట్టిందని హరీశ్‌రావు తన ప్రసంగంలో ఉదహరించారు. దీంతో ఎఫ్ఆర్‌బీఎం లిమిట్ రూ.38,937 కోట్లకు పరిమితమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం సమంజసం కాని కారణాలను చూపి అసంబద్ధంగా ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకున్నదని విమర్శించారు. సహకార సమాఖ్య (ఫెడరల్ స్పిరిట్) స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టి, ఇలాంటి నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నదన్నారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం కోసం ఎఫ్ఆర్‌బీఎం పరిధికి లోబడి బడ్జెటేతర రుణాలను సమకూర్చుకున్నదని, కానీ దీన్ని బడ్జెట్ లెక్కల్లో చూపి కోత పెట్టిందని ఆరోపించారు.

విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలేదని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తులను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. చట్టంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలోని తొమ్మిది వెనకబడిన జిల్లాలకు ఏటా రూ. 450 కోట్లు రావాల్సి ఉన్నదని, మూడేండ్లుగా రూ. 1,350 కోట్లు విడుదల కాలేదని గుర్తుచేశారు. విధాన నిర్ణయాలు చేసే నీతి ఆయోగ్ 2015లోనే తెలంగాణలోని మిషన్ భగీరథకు రూ. 19,205 కోట్లు, మిషన్ కాకతీయకు రూ. 5,000 కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినా ఇప్పటికీ పైసా విడుదల చేయలేదని ఆరోపించారు. 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసులకు సైతం కేంద్ర ప్రభుత్వం తిలోదకాలిచ్చిందన్నారు. తెలంగాణకు స్పెషల్ గ్రాంట్ కింద రూ. 723 కోట్లు, పోషకాహార కార్యక్రమానికి రూ. 171 కోట్లు ఇవ్వాలని చెప్పినా మొండిచేయి చూపించిందన్నారు.

తెలంగాణకు 2021-26 మధ్యకాలంలో రూ. 5,374 కోట్లను గ్రాంటుగా ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసినా ఇప్పటికీ ఇవ్వకుండా అన్యాయం చేసిందన్నారు. దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ ఏ కేంద్ర ప్రభుత్వమూ ఆర్థిక సంఘం సిఫారసులను బేఖాతరు చేయలేదని, తొలిసారి తెలంగాణ విషయంలో ఇలా వ్యవహరించిందన్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో రాయితీలతో పాటు పరిశ్రమలకు ఇన్సెంటివ్ అమలు చేయాల్సి ఉన్నదని, కానీ రెండు రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీసిందన్నారు. మరోవైపు విభజన చట్టంలోని హామీలను సైతం అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు.

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన వర్శిటీలను స్థాపించాలని విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ ఎనిమిదిన్నరేళ్ళలో ఈ హామీలు నెరవేరలేదన్నారు. అప్పటికే మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును వివిధ కారణాలతో అర్థంతరంగా రద్దు చేసి తెలంగాణకు రాకుండా చేసిందన్నారు. నదీ జలాల విషయంలోనూ ట్రిబ్యునళ్ళు కాలయాపన చేస్తున్నాయని, రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నదని, కేంద్రం పట్టించుకోవడంలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్నా కేంద్రం నిర్లక్ష్యంగానే ఉన్నదన్నారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి తరహా ప్రాజెక్టుల నిర్మాణానికి ఆటంకం కలుగుతున్నదన్నారు. ఈ తీరును తెలంగాణ తీవ్రంగా నిరసిస్తున్నదన్నారు.

విద్యుత్ బకాయిల విషయంలోనూ ఏపీ, తెలంగాణ మధ్య వివాదాన్ని కేంద్రం పరిష్కరించలేదని గుర్తుచేశారు. విద్యుత్ వినియోగానికి సంబంధించి తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ నుంచి రూ. 17,828 కోట్లు రావాల్సి ఉన్నదని, కేంద్ర హోంశాఖకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని, చివరకు కోర్టును ఆశ్రయిచాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి రూ. 6,756 కోట్లను నెల రోజుల వ్యవధిలో ఏపీకి చెల్లించాలంటూ తెలంగాణ జెన్‌కో సంస్థకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ లేఖ రాయడాన్ని తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వివక్షకు ఇలాంటి గడువుతో కూడిన లేఖ రాయడం పరాకాష్ట అని మంత్రి వ్యాఖ్యానించారు.

కేంద్ర ప్రభుత్వ తీరు కారణంగా తెలంగాణకు రావాల్సిన సెంట్రల్ స్కీమ్‌లకు సంబంధించిన రూ. 495 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ళిపోయాయని, వీటిని తిరిగి ఇప్పించాల్సిందిగా కేంద్రానికి లేఖలు రాసినా ప్రయోజనం లేదన్నారు. పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని సైతం కేంద్రం అమలుచేయకపోవడం అప్రజాస్వామికమని దుయ్యబట్టారు.

Also Read..

కార్యకర్తపై మాజీ మంత్రి Babumohan దుర్భాషలు


Next Story