పెరిగిన కొత్త బియ్యం ధరలు

by Dishafeatures2 |
పెరిగిన కొత్త బియ్యం ధరలు
X

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: కొత్త బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. గడిచిన పదిహేను రోజుల్లోనే 500 నుంచి 800 రూపాయలకు పెరిగింది. దాంతో కొత్త బియ్యం వచ్చాయి..కొని పెట్టుకుందామని మార్కెట్లకు వెళుతున్న జనం షాకవుతున్నారు. మిల్లర్లు..వ్యాపారులు కలిసి చేస్తున్న మాయాజాలమే దీనికి కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలన్న డిమాండ్​వినిపిస్తోంది. లేనిపక్షంలో మధ్యతరగతి..నిరుపేద వర్గాల కష్టాలు మరింతగా పెరుగుతాయని అంటున్నారు. ఖరీఫ్​సీజన్​ముగిసి జనవరి నెల వచ్చిందంటే రైతుల కొట్టాల్లో వడ్ల సంచులు నిండిపోయే విషయం తెలిసిందే.

అక్కడి నుంచి ఈ వడ్లు రైస్​మిల్లులకు చేరి బియ్యంగా మారుతాయి. మలక్​పేటలోని మహబూబ్​మాన్షన్​మార్కెట్లో బియ్యం వ్యాపారం చేస్తున్న రాజు చెప్పిన ప్రకారం ప్రతీ యేటా ఇలా కొత్తగా మార్కెట్​లోకి వచ్చే బియ్యం ధర 3వేల అయిదు వందల నుంచి 3వేల ఆరువందల రూపాయల మధ్య ఉండేది. గడిచిన పదేళ్లుగా ఎప్పుడూ బియ్యం ధరలు దీనికన్నా పెరిగి 4వేల రూపాయలకు కూడా దరిదాపుగా వెళ్లలేదు. ఈసారి కూడా సంక్రాంతికి ముందు కొత్త బియ్యం క్వింటాలు ధర నాలుగు వేల రూపాయల లోపే ఉంది. అయితే, అయితే, గడిచిన పదిహేను రోజుల్లోనే కొత్త బియ్యం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి.

ప్రస్తుతం మార్కెట్​లో కొత్త బియ్యం క్వింటాలు ధర నాలుగు వేల మూడు వందల రూపాయలకు చేరుకుంది. దాంతో పాతబియ్యం ధరలు కూడా పైకి ఎగిశాయి. ప్రస్తుతం కర్నూలు సోనా మసూరి బియ్యం క్వింటాలు ధర అయిదువేల తొమ్మిది వందల రూపాయలకు చేరగా వరంగల్​సోనా మసూరి బియ్యం అయిదువేల ఆరు వందల రూపాయల ధర పలుకుతోంది. రైస్​మిల్లుల యాజమాన్యాలు...వ్యాపారులు పలువురు పెద్ద ఎత్తున బియ్యం నిల్వలు చేశారని తెలుస్తోంది. కృత్రిమ కొరతను సృష్టించి బియ్యం ధరలను అమాంతంగా పెంచేశారని మార్కెట్​వర్గాలే అంటున్నాయి.


Next Story